Delhi Elections : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఢిల్లీలో ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం ఎంచుకున్న రోజు పట్ల బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఎన్నికల సంఘం తీసుకున్న తెలివైన చర్య అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం వస్తుంది. దీని అర్థం ఈ రోజు సెలవు దినం కాదు. అంటే ఈ రోజు జనం అంతా నగరంలో ఉంటారు. సాధారణంగా కొన్ని కుటుంబాలు వారాంతాల్లో బయటకు వెళ్లడం లేదా కొన్నిసార్లు ఏదో ఒక పని కోసం నగరం నుంచి బయటకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంటుంది. బుధవారం ఆఫీసులు తెరుచుకోవడంతో నగరం నుంచి బయటకు వెళ్లే అవకాశం చాలా తక్కువ. బుధవారం ఓటింగ్ జరగడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేయడానికి ఇదే కారణం.
ఎన్నికల సంఘాన్ని ప్రశంసించిన బీజేపీ ఎంపీ
ఢిల్లీలోని చాందినీ చౌక్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్.. ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడాన్ని స్వాగతించారు . ముఖ్యంగా బుధవారం ఓటింగ్ రోజును నిర్ణయించడం ఎన్నికల సంఘం సమర్థవంతమైన చర్య అని అన్నారు. ఈ నిర్ణయం ఓటర్లు గరిష్ట సంఖ్యలో ఓటింగులో పాల్గొనేలా చేస్తుందని ఆయన అన్నారు.
పనిదినాల్లో ఓటింగ్ నిర్వహించడం వల్ల ప్రజలు సెలవు దినంగా భావించి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం తగ్గుతుందన్నారు. దీనికి విరుద్ధంగా ఈ నిర్ణయం వల్ల ఓటర్లు తమ బాధ్యతలను నెరవేర్చడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడడమే కాకుండా ఓటర్లకు తమ పాత్రపై మరింత అవగాహన కల్పిస్తుందని ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
‘బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం’
ఢిల్లీలో ఎన్నికల నగారాను ఎలక్షన్ కమీషన్ మోగించిందని, ఎన్నికల తర్వాత ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని బీజేపీ నేత అన్నారు. ఎన్నికల సంఘం ఈ దూరదృష్టి నిర్ణయాన్ని అభినందించారు. ఢిల్లీ వాసులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా , గరిష్టంగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు . కాగా, ఫిబ్రవరి 5వ తేదీ ఢిల్లీలో మార్పు తేది అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ఢిల్లీని దోచుకున్న ఆప్ ను ఢిల్లీ నుంచి తరిమికొట్టడమే పని అన్నారు. ఫిబ్రవరి 8న బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.