Ayodhya Ram Mandir-Kejriwal : అయోధ్య రాముడిని దర్శించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి.. సంచలన వ్యాఖ్యలు

రామాలయ ప్రాణ ప్రతిష్టకు ఎందుకు రాలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు అరవింద్ చేస్తున్న స్టంట్ ఇదని వారు ఎద్దేవా చేస్తున్నారు.. కాగా అరవింద్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది.

Written By: NARESH, Updated On : February 12, 2024 9:56 pm
Follow us on

Ayodhya Ram Mandir-Kejriwal : “రాముడు బిజెపి నాయకులకు మాత్రమే దేవుడా? బిజెపి నాయకులు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను వేడుకగా జరిపితే.. మేము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాం.. అసలు నిర్మాణం కూడా పూర్తి చేసుకోని గుడిని ప్రారంభించడం ఏంటి” ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. ఇంకెవరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అప్పట్లో అయోధ్య రామ మందిరం పై వివిధ రకాలుగా నోరు పారేసుకున్న ఆయన సోమవారం బాల రాముడిని దర్శించుకున్నారు. ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రామాలయంలోని బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రామాలయ ప్రాంగణంలో ఫోటో దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య చేరుకున్నాను. బాల రాముడు దివ్య దర్శనం చేసుకున్నాను. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా తన కుటుంబంతో రాముడిని దర్శించుకున్నారు” అని అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు.

రాముడిని దర్శించుకున్న తర్వాత చెప్పలేనటువంటి అనుభూతిలోనయ్యానని అరవింద్ కేజ్రివాల్ అన్నారు. బాల రాముడిని దర్శించుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా మారిందని పేర్కొన్నారు. ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని.. వారి మనసులో ఉన్న భక్తిని చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. రాముడిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతున్ని కోరుకున్నట్టు అరవింద్ పేర్కొన్నారు. రామాలయాన్ని చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తోందని.. రాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

రాముడిని దర్శించుకున్న అనంతరం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. హిందువుల ఓట్లు పొందేందుకు అరవింద్ కేజ్రీవాల్ రాముడిని దర్శించుకున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాముడిని దర్శించుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా మారిందని చెబుతున్న అరవింద్.. రామాలయ ప్రాణ ప్రతిష్టకు ఎందుకు రాలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు అరవింద్ చేస్తున్న స్టంట్ ఇదని వారు ఎద్దేవా చేస్తున్నారు.. కాగా అరవింద్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది.