Israel-Hamas War : ఇటీవల ఇజ్రాయిల్ పౌరులపై వీసా ఆంక్షలు విధించిన అమెరికా.. పాలస్తీనా పై దాడులు ఆపకపోతే భవిష్యత్తు కాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే కొద్దిరోజులపాటు ఇజ్రాయిల్ మౌనంగా ఉంది. దీంతో ప్రపంచ దేశాలు అమెరికా హెచ్చరికలు పనిచేశాయని భావించాయి. కానీ అంతకుమించి అనేలాగా ఇజ్రాయిల్ మళ్లీ దాడులు మొదలు పెట్టింది. ఈసారి ఏకంగా పాలస్తీనా దేశం లోని రాఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 67 మంది పాలస్తీనావాసులు చనిపోయారని ఇజ్రాయిల్ సైనిక వర్గాలు అంటున్నాయి. ఈ నగరంలో ఓ భవనంలో ఇద్దరు ఇజ్రాయిల్ పౌరులను పాలస్తీనా సైన్యం బందీలుగా చేసి పట్టుకోవడంతో.. వారిని ఇజ్రాయిల్ సైనికులు విడిపించారు.
హమాస్ తీవ్రవాదులను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఇజ్రాయిల్ దళాలు.. సోమవారం దక్షిణ గాజా నగరమైన రఫా పై మెరుపు దాడి చేశాయి. దాడుల్లో 67 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ నగరంలో దాదాపు 15 లక్షల మంది శరణార్థులుగా ఉన్నారు.. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పౌరులను బంధీలుగా పట్టుకుని ఇక్కడ ఓ భవనంలో దాచారు. ఈ నేపథ్యంలో మెరుపు దాడులు చేసి వారిని కాపాడినట్టు ఇజ్రాయిల్ దళాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ ఉన్న ఓ భవనంలోని వృద్ధులను ఇజ్రాయిల్ దళాలు కాపాడాయి. రఫా పై దాడి చేయాలనే ప్రణాళికను అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించినప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం తను అనుకున్నది చేసింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్ దేశంపై హమాస్ దాడి చేసింది. ఆ తర్వాత ఇజ్రాయిల్ దళలు ప్రతిదాడులు మొదలుపెట్టాయి. అక్టోబర్ 7న జరిగిన దాడిలో 1200 మంది ప్రాణాలు కోల్పోగా.. 253 మందిని హమాస్ తీవ్రవాదులు బంధీలుగా తీసుకెళ్లారు. ఇక ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు సుమారు 28 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు హమాస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటు ఇజ్రాయిల్ దళాలు, అటు హమాస్ తీవ్రవాదుల దాడి, ప్రతిదాడులతో మధ్య ఆసియా ప్రాంతం దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే పాలస్తీనా సమూలంగా నాశనమైంది. ఎటు చూసినా శిధిల భవనాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇజ్రాయిల్ దళాలు బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. మరోవైపు హమాస్ తీవ్రవాదులు మొదట్లో ఇజ్రాయిల్ పై దాడి చేసి.. తర్వాత సైలెంట్ అయ్యారు. ఫలితంగా ఆ ప్రతీకారాన్ని ఇజ్రాయిల్ దేశం పాలస్తీనా పై తీర్చుకుంటున్నది. ఇప్పటికే రష్యా_ ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. తాజాగా ఇజ్రాయిల్_ పాలస్తీనా మధ్య దాడులతో ఆ పరిస్థితులు ఇంకా దారుణంగా మారాయి. ఇవి మునుముందు రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది.