ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ ఉపాధి హామీ పథకానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే దరఖాస్తు చేసుకుని ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేదా..? అయితే ఈ ఫోటో చూడండి. మరో స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కూలి పని చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.
ఉపాధి జాబ్ కార్డులపై దీపికా, జాక్వెలిన్ ఫోటోలను చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా హీరోయిన్ల ఫోటోలతో జాతీయ ఉపాథి హామీ పథకంలో గోల్ మాల్ జరుగుతోంది. రాష్ట్రంలోని జిర్న్యా జిల్లా పిపర్‌ఖేడా నకా పంచాయితీ సర్పంచ్, కార్యదర్శి కలిసి బాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలతో నకిలీ జాబ్ కార్డులను సృష్టించారు. ఈ కార్డులో దీపికా పదుకొణే పేరు మోనూ దూబేగా ఉంది.
ఇప్పటివరకు మోనూ దూబే ఉపాధి హామీ పని చేసినట్లు 30 వేల రూపాయలు విత్ డ్రా అయ్యాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో ఉన్న జాబ్ కార్డులో సోనూ అనే పేరుతో ఉంది. సర్పంచ్, కార్యదర్శి, ఉపాథి హామీ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడి ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది. నకిలీ జాబ్ కార్డులు సృష్టించి మోసాలకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
మోసగాళ్లు మోసాలు చేయడం కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల ఫోటోలను ఎంచుకోవడం గమనార్హం. జిల్లా పంచాయితీ సీఈవో గౌరవ్ బెనల్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గతంలో ప్రభుత్వం అమలు చేసే పథకాల కార్డుల్లో, ఓటరు కార్డుల్లో సైతం పలువురు హీరోలు, హీరోయిన్ల ఫోటోలు దర్శనమిచ్చిన సంగతి విదితమే.