Homeజాతీయ వార్తలుKaleshwaram Project Debts: కేసీఆర్ కు బిగిస్తున్న ‘కాళేశ్వరం’ ఉచ్చు?

Kaleshwaram Project Debts: కేసీఆర్ కు బిగిస్తున్న ‘కాళేశ్వరం’ ఉచ్చు?

Kaleshwaram Project Debts: మూలిగే నక్క పై తాటిపండు పడటం అంటే ఇదేనేమో! ఇప్పటికే మోటర్లు మునిగి.. రక్షణ గోడలు కూలి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పులు ఇచ్చిన బ్యాంకులు మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని వ్యాఖ్యలు చేసిన తర్వాత.. బ్యాంకుల కన్సార్షియం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను లెక్కలు కోరడం గమనార్హం. కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కెసిఆర్, బ్యాంకులు అడుగుతున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సి ఉంది. ఇక బ్యాంకుల కన్సార్షియం అడిగిన లెక్కల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నీటిపారుదల శాఖ చెప్పిన లెక్కలు వింతగా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నీటి తీరువా, పారిశ్రామిక అవసరాలు, జంట నగరాల ప్రజలకు తాగునీటి సరఫరాతో పాటు ప్రాజెక్టు వెంట ఉన్న గ్రామాల నుంచి బిల్లుల రూపేణా 65,454 కోట్ల మేర ఆదాయం వస్తుందని, దీంతో అసలు, వడ్డీ చెల్లిస్తామంటూ టెక్నో ఎకనామిక్ వయలబులిటీ నివేదికను ప్రభుత్వం బ్యాంకుల కన్సర్షియానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగానే వివిధ జాతీయ బ్యాంకులు ప్రాజెక్టు కు రుణాల మంజూరు చేశాయి.

Kaleshwaram Project Debts
KCR

అయితే నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పూర్తయ్యదాకా వడ్డీని రాష్ట్ర బడ్జెట్ నుంచి కడతామని అప్పట్లో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తయిందని, వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయని అదే రోజు జరిగిన బ్యాంకుల కన్సార్షియం సమావేశంలో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈ ప్రకారం జూన్ నెల నుంచి మొదలైన తొలి త్రైమాసిక వాయిదాను ఈ సెప్టెంబర్ లో చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తయిందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఏ మేరకు ఆదాయం సమకూరిందో వివరాలు ఇవ్వాలని బ్యాంకులు కోరాయి. దీనిపై నీటిపారుదల శాఖ ఈఎన్ సీ మురళీధరరావు స్పందించారు. పరిశ్రమలు, జంట నగరాలకు తాగునీరు, మిషన్ భగీరథ, పర్యాటకం, ఫిషరీస్.. వీటి అన్నింటితో ముడిపడిన కార్యకలాపాలతో ఏ మేరకు నిధులు సమకూర్చుకున్నారో బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, గజ్వేల్ ఈ ఎన్ సీ హరిరామ్ ను ఆదేశిస్తూ లేఖ రాశారు. వాస్తవానికి నీటిపారుదల శాఖలో ఈఎన్ సీ జనరల్ గా మురళీధర్ కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా హరిరాం వ్యవహరిస్తున్నారు. కాలేశ్వరం కార్పొరేషన్ లో మురళీధర్ డైరెక్టర్ అయినప్పటికీ, కార్పొరేషన్ ప్రత్యేక విభాగంగా ఉండడంతో హరిరామ్ కు బ్యాంకులు లేఖ రాశాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ₹86,064 కోట్ల మేర కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు తీసుకుంది. ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి 7,400 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం నుంచి 11,400 కోట్లు, విజయ బ్యాంకు నుంచి 2,150 కోట్లను తీసుకుంది. ఈ రుణమంతా చేతికి రాగానే వాడుకొని వడ్డీ చెల్లిస్తున్నారు.

Also Read: KCR vs BJP : టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. త్వరలో కాంగ్రెస్ అంతర్థానం!

ఆ స్థాయిలో ఆదాయం ఉందా

ప్రాజెక్టు వెంట ఉండే గ్రామాల ప్రజలు తాగేందుకు పది టీఎంసీల మేర మిషన్ భగీరథ తో పాటు, జంట నగరాలకు నీరు సరఫరా చేసే వాటర్ బోర్డుకు 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు ఇచ్చి నిధులు వసూలు చేసుకుంటామని, ప్రాజెక్టు కింద కొత్తగా 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) స్టేజీ 1, 2తో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, సింగూరు, ఇందిరమ్మ వరద కాలువ కింద ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కలుపుకొని 169 టీఎంసీలను ఇవ్వడం ద్వారా నీటి తీరువాతో ఆదాయం రానందనే వివరాలు సమర్పించి ప్రభుత్వం రుణాలు మంజూరు చేయించుకుంది. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి శిస్తుతో పాటు నీటి తీరువాను రద్దు చేసింది. పైగా ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు కూడా మాఫీ అయ్యాయి. హైదరాబాదులో నెలకు 20,000 లీటర్ల దాకా ఉచితంగానే నీరు సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నందుకు వసూలు చేస్తున్న బిల్లులు కాళేశ్వరం కార్పొరేషన్ ఖాతాలో జమ చేయడం లేదు. దీంతోపాటు ఈ పథకాల కరెంటు బిల్లు మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది.

Kaleshwaram Project Debts
KCR

దీంతో ఆదాయ మార్గాలన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. తాజాగా పరిశ్రమలకు నీటి సరఫరాతో ఏటా నాలుగు వేల కోట్ల దాకా రానుందని అధికారులు లెక్కలు తీశారు. కానీ ఇప్పటికే నాలుగు పరిశ్రమలు మాత్రమే కాళేశ్వరం నీరు అందించాలని దరఖాస్తు పెట్టుకున్నాయి. ఇవి చెల్లించే నిధులను కార్పొరేషన్ ఖాతాలో జమకు అనుమతి ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. పర్యాటకం, చేపల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం పెద్దగా ఏమీ ఉండదు. ఈ స్థాయిలో నీటి వనరులు లేకున్నా ఖమ్మం జిల్లా పాలేరులో కేజ్ కల్చర్ ద్వారా చేపలను, రొయ్యలను పెంచుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ స్థాయిలో ఆదాయం ఉంటే ఇప్పటికే అక్కడ ఫిషరీస్ సంస్థలు ఏర్పాటు అయ్యేవి. ప్రభుత్వం ప్రకటించినట్టు కాళేశ్వరం ఇంకా పూర్తి కాలేదు. పూర్తిస్థాయిలో చేతికి వచ్చేందుకు మరో ఐదు ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించే ప్రధాన పథకంతో పాటు అదనంగా ఒక టీఎంసీ తరలించే పథకానికి 1.15 లక్షల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటికే 87 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో 37 వేల కోట్లు అవసరం. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణానికి 59, 478 ఎకరాలు సేకరించారు. మరో 20,000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో ఎకరం భూమి విలువ 50 లక్షల నుంచి కోటి దాకా పలుకుతుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరు.

ముంపు మాటేమిటి?

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎర్త్ వర్క్ 73 శాతం, కాంక్రీట్ వర్క్ 57 శాతం పూర్తయింది. ప్రధాన కాల్వల నిర్మాణం 58 శాతం పూర్తయింది. ఇటీవల కురిసిన వర్షాలకు మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్ లు మునిగాయి. మేడిగడ్డ పూర్తయితేనే అన్నారం మనుగడ ఉంటుంది. ఆ పంపు హౌస్ నుంచే అన్నారంలోకి నీటిని ఎత్తిపోస్తారు. కాగా మేడిగడ్డలో రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పంపుల్లో ఒకటి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఒక టీఎంసీ పంపులను పక్కనపెట్టి, రెండు టీఎంసీల పంపులు సిద్ధం చేసి నడిపించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఇక ఇప్పుడు సరిగ్గా మునుగోడు ఉప ఎన్నికల ముందు బ్యాంకుల కన్సార్షియం కెసిఆర్ ను ఇరుకున పెట్టేలా లేఖలు రాయడం గమనార్హం. అయితే కెసిఆర్ ఇచ్చే సూచనల ఆధారంగానే చర్యలు తీసుకునే యోచనలో నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.

Also Read:Adani`s Empire : అదానీ వ్యాపార సామ్రాజ్యం అప్పుల ఊబిలో కుప్పకూలనుందా?

 

100 కోట్ల క్లబ్‌లో నిఖిల్.. పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాడు | Nikhil Karthikeya 2 Joins 100 Cr Club

 

గుండెపోటుతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ మృతి || Bigg Boss Contestant Passes Away || Sonali Phogat

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version