Bhadradri Kothagudem District:ఫస్ట్ తారీఖు జీతం వచ్చిందా.. స్కూలుకు వెళ్ళామా.. ఓ 7:30 గంటలు అక్కడ ఉన్నామా.. మెజారిటీ గవర్నమెంట్ టీచర్లు ఇలానే ఉంటారు. విద్యార్థులు స్కూలుకు రాకపోయినా.. సరిగ్గా చదవకపోయినా.. ఏమాత్రం పట్టించుకోరు.. ఎక్కువ మంది ఉపాధ్యాయులు చీటి పాటలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లు చేస్తూ దండిగా సంపాదిస్తుంటారు. ఇలాంటి విద్యా వ్యవస్థ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.. ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది..
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో నిమ్మగూడెం గ్రామంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.. నిమ్మగూడెం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గడిచిన వారం రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు. విద్యార్థి తరగతులకు హాజరు కాకపోవడంతో ఉపాధ్యాయులు అతడి తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల ప్రశ్నలకు ఆ తల్లిదండ్రులు సక్రమమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో వారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆ విద్యార్థి ఎలాగైనా స్కూలుకు రావాలని.. ఆ విద్యార్థికి ఏం జరిగిందో తెలియాలని.. వారు నిరసన చేపట్టారు.. బాలుడి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. తమ ఇంటి ఎదుట ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఆ బాలుడి తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో వెంటనే అతడిని సోమవారం నుంచి స్కూలుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థులు, ఉపాధ్యాయులు ధర్నా విరమించుకున్నారు..
ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులలో జవాబుదారీతనం లోపిస్తోందని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు తగ్గట్టుగానే ఉపాధ్యాయుల వ్యవహార శైలి ఉంటున్నది.. అయితే అప్పుడప్పుడు విధి నిర్వహణలో నిక్కచ్చితనాన్ని పాటించే ఉపాధ్యాయులు కూడా ఉంటారని.. దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకున్న ఘటన నిరూపించింది.
ఈ స్కూలు లో గతంలో విద్యార్థుల సంఖ్య భారీగానే ఉండేది. కానీ ఆ తర్వాత తగ్గిపోయింది. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో రేషనలైజేషన్ ప్రక్రియలో ఈ స్కూలును ఇతర ప్రాంతానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు.. ఈ స్కూలును కాపాడుకోవడానికి ఉపాధ్యాయులు నడుం బిగించారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించారు. అనేక రకాలుగా ప్రయాసపడి చివరికి విద్యార్థుల సంఖ్యను పెంచారు. ఒక విద్యార్థి కూడా స్కూలు నుంచి వెళ్లిపోవడానికి ఇక్కడ ఉపాధ్యాయులు ఒప్పుకోవడం లేదు.. అందువల్లే పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థి విషయంలో ఉపాధ్యాయులు ఇంతటి యుద్ధానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది.