మాజీ పోలీసాయన రాజకీయం: మొన్న తీన్మార్ మల్లన్న, నిన్న కాంగ్రెస్‌, నేడు టీఆర్‌ఎస్‌?

ఆయనో మాజీ పోలీసు అధికారి. రిటైర్‌మెంట్‌ సమయంలో ప్రభుత్వం కక్షగట్టి తనపై ఏసీబీ రైడ్‌ చేసిందని ఆవేదనకు గురయ్యాడు. ఆ ఆవేదనతోనే రాజకీయంగా తానూ ఎదగాలనుకున్నాడు. వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరిపోయారు. అందులో అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్నతో దోస్తీ ఏర్పడింది. ఆయన ఏర్పాటు చేసిన తీన్మార్‌ మల్లన్న టీంకు ఉత్తర తెలంగాణ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. రాజకీయాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు కదా.. తన […]

Written By: NARESH, Updated On : October 3, 2021 1:20 pm
Follow us on

ఆయనో మాజీ పోలీసు అధికారి. రిటైర్‌మెంట్‌ సమయంలో ప్రభుత్వం కక్షగట్టి తనపై ఏసీబీ రైడ్‌ చేసిందని ఆవేదనకు గురయ్యాడు. ఆ ఆవేదనతోనే రాజకీయంగా తానూ ఎదగాలనుకున్నాడు. వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరిపోయారు. అందులో అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్నతో దోస్తీ ఏర్పడింది. ఆయన ఏర్పాటు చేసిన తీన్మార్‌ మల్లన్న టీంకు ఉత్తర తెలంగాణ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. రాజకీయాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు కదా.. తన వ్యక్తిగత అవసరాల కోసం తీన్మార్‌ మల్లన్న ఇటీవల బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో అది నచ్చక వెంటనే మళ్లీ తనకు రాజకీయ అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. గాంధీభవన్‌లో సెప్టెంబర్ 31న చేరారు. ఏమైందో తెలియదుగానీ అక్టోబర్‌ 3న మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయనే మాజీ సీఐ దాసరి భూమయ్య..

దాసరి భూమయ్యది హుజురాబాద్‌ మండలం మెట్‌పల్లి గ్రామం. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉంటూనే ఆయన సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేశారు. ఆయన పని చేసిన ప్రతిచోట ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకున్నారు. వృద్ధాశ్రమాల అవసరమైన సాయం చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలంలో పని చేస్తున్న సమయంలో పునరావాస కేంద్రంగా దాసరి భూమయ్య కాలనీలని ఏర్పాటు చేశారు. అందులో పేదలకు ఇండ్లు ఏర్పాటు చేయించారు. రైతులకు యూరియా కొరత ఉన్న సమయంలో యూరియా బస్తాలు తెప్పించారు. ఇలా ఆయనకు ప్రజల్లో మంచిపేరుంది. ఆయన వృత్తిపరంగా కఠినంగా వ్యవహరించేవారని, పైరవీలకు లొంగకుండా, పై అధికారుల మాట కూడా వినకుండా పని చేసే వారని పేరుంది. ఆయనతోపాటు పని చేసిన అధికారులంతా డీఎస్పీలు, ఏసీపీలు అయ్యారు. ఆయనకు మాత్రం మెమోలు వచ్చాయి. అంత కఠినంగా డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన పేరుంది.

హుస్నాబాద్‌ సీఐగా పని చేస్తున్న సమయంలో పై అధికారుల అవినీతిపై ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడారు. అప్పటి సీపీ శివకుమార్‌ అధికార దుర్వినియోగంపై దునుమాడారు. తర్వాత కొన్ని రోజులకు హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి తుపాకీ మాయమైన కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యల కింద ఆదిలాబాద్‌ జిల్లాకు ట్రాఫిక్‌ సీఐగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. అక్కడే పనిచేస్తున్న సమయంలోనే ఆయనపై అక్రమాస్తుల కేసు విషయంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడం.. ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగి పోయింది. ఈ క్రమంలోనే ఆయన రిటైర్‌మెంట్‌ కూడా అయిపోయింది.

పోలీస్ వ్యవస్థను, రాజకీయాలను తప్పు పట్టిన దాసరి భూమయ్య తనకంటూ రాజకీయ భవిష్యత్‌ ఉండాలని భావించారు. రాజకీయాల్లో ఉంటేనే తన వాయిస్ వినిపించవచ్చని భావించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ జిల్లా అధికార ప్రతినిధిగా పని చేశారు. కానీ పెద్దగా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారు. ఈ వెపన్‌ మిస్సింగ్‌ కేసులోనే తీన్మార్‌ మల్లన్న ఆయన్ని స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశారు. మల్లన్నతో ఆయనకు ఏర్పడ్డ పరిచయం రాజకీయంగా పని చేసేలా చేసింది. మల్లన్న ఏర్పాటు చేసిన మల్లన్న టీంకు ఉత్తర తెలంగాణ ఇన్‌చార్జిగా ఉంటూ కమిటీలు కూడా వేశారు. సెప్టెంబర్‌ 30న తీన్మార్‌ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించగానే సెప్టెంబర్‌ 31న తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఆదివారం నాడు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడమే అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏ పార్టీతోనైతే తను ఇబ్బంది పడ్డారో అదే పార్టీ కండువా కప్పుకోవడం వెనుక ఉన్న అంతర్యమేంటనేది అర్థంగానీ ప్రశ్నగా మారింది. ఏదేమైనా ఆ మాజీ పోలీసాయనకు రాజకీయాలు బొత్తిగా అచ్చిరాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారట.