
Dalithabandhu: దళితబంధు పథకం ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని వ్యతిరేకించలేక.. వ్యతిరేకిస్తే దళిత సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీలో డిఫెన్స్ లో పడిపోయాయి. కేసీఆర్ వేసిన ఈ ఎత్తుతో కక్కలేక మింగలేని పరిస్థితి పార్టీలకు ఎదురవుతోంది.
ప్రభుత్వం దళితబంధు పథకంతో చరిత్ర సృష్టించాలని భావిస్తున్న తరుణంలో పథకాన్ని మరింత విస్తృతం చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే మరో నాలుగు మండలాలకు విస్తరించి ఈ పథకం తెలంగాణలో అమలు చేయాలని భావిస్తున్నారు. దళితబంధు పథకాన్ని విమర్శిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తన సహచర కాంగ్రెస్ సీనియర్ నేతలు దీనిపై వ్యతిరేకించాలని చెబుతున్నా వారు మాత్రం ఆయన మాట వినడం లేదట. పథకంపై కేసీఆర్ సర్కార్ నిర్వహించే సమావేశానికి ఆహ్వానాలు వస్తే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట.. ఇదే ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శరాఘాతంగా మారిందట..
సీఎం కేసీఆర్ దళితబంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని దళిత ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఆ సమావేశానికి వెళ్లాలా? వద్దా అనే సంశయంలో కాంగ్రెస్ నేతలు ఆలోచనలో పడిపోయారు. ఎవరు ఏమనుకున్నా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దళితబంధుతో లబ్ధి పొందే ప్రజలకు న్యాయం చేయాలనే చూస్తున్నట్లు భావిస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం దళితబంధు పథకం గురించి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ వంటి నేతలు దళితబంధు సమావేశానికి హాజరుకావాలని ప్రతిపాదించారట.. దీంతో దళితబంధు పథకం దళితులకు మేలు చేసేదిగా ఉందని కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకం అని ముద్ర పడకుండా దళితులకు సాయం చేసిన పార్టీగానే పేరు తెచ్చుకోవాలని భావిస్తోంది.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమమైనందున కాంగ్రెస్ తరఫున తాము హాజరవుతామని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. పథకం అమలు విషయంలో కాంగ్రెస్ పై ఎందుకు వ్యతిరేక భావం తేవాలని వారంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మీద ఉన్న అపవాదును తొలగించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు ‘దళితబందు’కు జై కొట్టడం.. రాజకీయంగా టీపీసీసీ చీఫ్ పై తిరుగుబాటు చేసినట్టేనని చెబుతున్నారు.మరి ఈ పరిణామం కాంగ్రెస్ లో ఎలాంటి అలజడలకు కారణమవుతుందో చూడాలి.