ఈ సంవత్సర ముగింపు నాటికి కరోనా వ్యాక్సిన్, ఔషధాలపై పురోగతి కనిపించకుంటే 2021నాటికి కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఎంఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అత్యధికంగా భారత్ లో నిత్యం 2.8లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా అమెరికాలో 95,000, దక్షిణాఫ్రికాలో 21,000, ఇరాన్‌లో 17,000 కేసులు నమోదు కావచ్చని పరిశోధకుల అంచనా.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 475కోట్ల జనాభా కలిగిన 84దేశాల(భారత్ తోపాటు, చైనా మినహా) సమాచారాన్ని విశ్లేషించినట్లు ఎంఐటీ ప్రొఫెసర్లు హజీర్ రహ్మాన్‌దాద్, జాన్ స్టెర్మాన్ వెల్లడించారు. కరోనా వైరస్ తీవ్రత, నిర్ధారణ పరీక్షలు, మరణాల సంఖ్య, వ్యక్తిగత శుభ్రత, ఆసుపత్రుల సామర్థ్యం, విధాన నిర్ణయాలు, సామాజిక వైఖరులను పరిగణలోకి తీసుకొని ఈ అంచనాలకు వచ్చామని తెలిపారు. ఇదిలాఉంటే, అమెరికాలో ఈ వైరస్ ప్రభావం ప్రస్తుతం బయటపడుతున్న దానికంటే పదిరెట్లు ఎక్కువగానే ఉండవచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఈమధ్యే వెల్లడించింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోటి పదిలక్షల మందికి సోకిన ఈ మహమ్మారి, దాదాపు ఐదున్నర లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అయితే, ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నమోదైన దానికంటే దాదాపు 12రెట్లు ఎక్కువగానే ఉండవచ్చని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా రెట్టింపు ఉండొచ్చని అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలతోపాటు మానవ జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న ఈ మహమ్మారిని సమర్థంగా కట్టడిచేయకుంటే 2021 మార్చి నాటికి 25కోట్ల మంది ఈ వైరస్ బారినపడడంతోపాటు 18లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ఎంఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.