దేశంలో గత కొన్ని రోజులుగా డెల్టా ప్లస్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. ఈ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం డెల్టా ప్లస్ కేసులు నమోదవుతున్నాయి. డెల్టా ప్లస్ సోకిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ ఇప్పటికే మృతి చెందారు. సదరు మహిళ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల వైరస్ ప్రభావం ఆమెలో ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం డెల్టా ప్లస్ వేరియంట్ ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించగా డెల్టా, దాని అనుబంధ వేరియంట్లతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతుండటం గమనార్హం. కరోనా జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ ద్వారా మాత్రమే థర్డ్ వేవ్ ను నియంత్రించడం సాధ్యమవుతుందని నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.
మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచనలు చేయడంతో పాటు తొందరపడి ఆంక్షలను పూర్తిగా సడలించవద్దని చెప్పుకొచ్చారు. మాస్క్ లేకపోతే పక్కన ఉన్నా డెల్టా ప్లస్ వేరియంట్ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు.
ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కొత్త వేరియంట్ సోకుతుందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. దాదాపు 45 వేల నమూనాల్లోని జన్యుక్రమాలను విశ్లేషించి ఈ కేసులను గుర్తించడం జరిగింది. అయితే కరోనా వ్యాక్సిన్లు రూపాంతరం చెందిన వైరస్ పై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.