
పోలీసుల ఎదురుకాల్పుల్లో.. బెటాలియన్ వలలో చిక్కని మావోయిస్టులు కరోకా కాటుకు బలవుతున్నారు. దశాబ్దాలుగా సుధీర్ఘ పోరాటం చేసి.. అత్యున్నత స్థాయిలో పోరాటాల్లో పాల్గొన్న కీలక నేతలు అనారోగ్యంతో మరణించడం మావోయిస్టు పార్టీల్లో కలకలం రేపుతోంది. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హరిబూషణ్ అలియాస్ జగన్ మరణాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించడంతో 30 ఏళ్ల ఆయన ప్రస్థానం ముగిసినట్లయింది. ఇక మరో కీలక మహిళా నేత భారతక్క సైతం కరోనా కాటుకు బలైనట్లు పార్టీ ప్రకటన చేసింది. దీంతో కరోనా వైరస్ మావోయిస్టు పార్టీని ఛిన్నభిన్నం చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.
హరిభూషణ్ అలియాజ్ జగన్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం. ఆదివాసులైన యాప కొమ్మక్క, రంగయ్యల మొదటి సంతానం హరిభూషణ్. ఆయన కళాశాలల్ చదువుతున్న రోజుల్లో రాడికల్ విద్యార్థి సంఘంలో చేరారు. ఈ క్రమంలో 1991లో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై దళంలో చేరారు. 1996లో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యునిగా కొనసాగారు. 1998లో ఉత్తర తెలంగాణ ఏరియా బాధ్యతలు తీసుకున్నారు. 2015లో రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా పనిచేసి 2018లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. దీంతో ఆయనను పార్టీ అధిష్టానం చత్తీస్ గడ్ కు పంపింది.
అప్పటి నుంచి ప్రభుత్వాలు జరిపిన ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ గ్రీన్ హంట్ లల్లోనూ హరిభూషన్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. 2013లో జరిగిన పువర్తి ఎన్ కౌంటర్లో ఆయన మృతి చెందారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ ఘటనలో ఆయన తప్పించుకున్నారు. 2016లో జరిగిన బొట్టెంతోగు ఎదురుకాల్పుల నుంచి బయటపడ్డారు. కానీ కారోనా కాటు నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రభుత్వం ఆయన తలపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. ఇక గంగారానికి చెందిన సమ్మక్కను ఆయన ఉద్యమంలో ఉండాగానే వివాహం చేసుకున్నారు.
మావోయిస్టు మరో కీలక మహిళ నేత భారతక్క కూడా కరోనా లక్షణాలతో మంగళవారం చనిపోయినట్లు పార్టీ ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఆదివాసీ కుటుంబానికి చెందిన భారతక్క 1985లో దళంలో చేరారు. 1986ల తన సహరుడు కోటి హన్మన్న మరణించారు. ఆ సమయంలో ఆమెకు కుమారుడు అభిలాష్ జన్మించారు. అయితే 2002లో ఆసుపత్రికి వచ్చిన భారతక్క అరెస్టయి 2005లో బయటకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ దళంలోకి వెళ్లారు. 2008లో దండకారణ్యానికి బదిలీ అయ్యారు. కుమారుడు అభిలాష్ కూడా దళంలో చేరి 2020లో గడ్చిరోలీలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.