కార్పొరేట్ మాఫియా-చేవచచ్చిన సమాజం-చేతగాని ప్రభుత్వాలు

కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా ఉందని అందరూ అంటున్నారు. విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలని లెఫ్ట్, ప్రోగ్రెసివ్ విద్యార్తి సంఘాలు, సంస్థలు దశాబ్దాలుగా కొట్లాడుతూనే ఉన్నారు. ఏనాడైనా వాళ్ళతో కలిసి పోరాడారా? ఒక్క అడుగైనా వాళ్ళ ర్యాలీలో నడిచారా? ఒక్క నిమిషమైన వాళ్ళ ధర్నాలో కూర్చున్నారా? ఆరోగ్య శ్రీ అనేది కులస్థుల కార్పొరేట్ హాస్పిటల్స్ ని బతికేంచేందుకే. సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు కార్పొరేట్స్ హాస్పిటల్స్ కి ఆరోగ్య శ్రీ స్కీమ్ కిందా ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు […]

Written By: NARESH, Updated On : May 24, 2021 5:38 pm
Follow us on

కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా ఉందని అందరూ అంటున్నారు. విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలని లెఫ్ట్, ప్రోగ్రెసివ్ విద్యార్తి సంఘాలు, సంస్థలు దశాబ్దాలుగా కొట్లాడుతూనే ఉన్నారు. ఏనాడైనా వాళ్ళతో కలిసి పోరాడారా? ఒక్క అడుగైనా వాళ్ళ ర్యాలీలో నడిచారా? ఒక్క నిమిషమైన వాళ్ళ ధర్నాలో కూర్చున్నారా?

ఆరోగ్య శ్రీ అనేది కులస్థుల కార్పొరేట్ హాస్పిటల్స్ ని బతికేంచేందుకే. సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు కార్పొరేట్స్ హాస్పిటల్స్ కి ఆరోగ్య శ్రీ స్కీమ్ కిందా ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇస్తున్నాయి. వాటినే జిల్లాలకు కేటాయించి నిమ్స్ లాంటి హాస్పిటల్స్ కట్టలేరా? దాంతో వైద్య రంగంలో ఉద్యోగాల భర్తీ అవుతుంది కదా. నర్సింగ్, హాస్పిటల్ కీపింగ్ స్టాఫ్, సానిటేషన్ ఇన్ని విభాగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతుంది కదా.

విద్యారంగంలో ఫీజు రీ ఎంబర్స్మెంట్ కూడా అంతే. కోళ్లఫారాల స్థానంలో వెలిసిన ఇంజనీరింగ్ ఫారాలను బతికించేందుకు వచ్చిన స్కీం. ఆ డబ్బులతో స్కూళ్లు, కాలేజీలూ కడితే ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుంది. రాష్ట్రంలో బీఈడీ, ఎంఈడీలు చేసి ఉద్యోగాలు దొరకని వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వొచ్చు.
విద్యా, వైద్యం ప్రభుత్వమే అందరికీ ఉచితంగా అందించాలి. ఆ వైపుగా కనీసం ఇప్పుడైనా మాట్లాడటం లేదు.

జనాలు. మీకు గుర్తుందో లేదో. మొదటి వేవ్ లో చాలా ప్రయివేట్ హాస్పిటల్స్ కోవిడ్ పేషేంట్లను చేర్చుకోలేదు. గేట్లు మూసుకుని ఉన్నాయి. పరిశోధనలు జరిగి మెడిసిన్ ఏవి వాడాలో ప్రోటోకాల్ వచ్చాకే ఆ గేట్లు తెరుచుకున్నాయి. ఆ కాలమంతా గాంధీ, ఇతర ప్రభుత్వ హాస్పిటల్సే వేలాదిమందిని కాపాడాయి. ప్రభుత్వ వైద్యులే ప్రాణాలు నిలబెట్టింది. పి.హెచ్.సీల్లో డాక్టర్లను బెదిరించి మందులు తీసుకుపోయే మా నక్సలైట్ అన్నలు “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు” అనే పనికిమాలిన పాటను పాడి ప్రచారం చేశారు. అట్లా చేసిన వాళ్లే మళ్ళీ వైద్య రంగాన్ని జాతీయం చేయాలి అంటారు. (దీన్ని రివ్యూ చేసుకున్నట్లగా నాకైతే తెలియదు. ఎవరైనా చెబితే సంతోషం).

ప్రభుత్వాలు ఎప్పుడూ కార్పొరేట్ల కోసమే పనిచేస్తాయి. అవి ప్రజల కోసం పనిచేయాలి అంటే పోరాటం ఒక్కటే మార్గం. పోరాటం అన్నిసార్లు భౌతిక రూపమే తీసుకోవాల్సిన అవసరం లేదు. (అంతిమంగా తీసుకోక తప్పదు) ఇది డిజిటల్ యుగం కదా. రాష్ట్రాల చీఫ్ మినిష్టర్ ఆఫీసులనీ, ట్విట్టర్ల పిట్టలను ట్యాగ్ చేస్తూ ఈ విషయాలు రాస్తే చాలు. కాస్త వాళ్ళ పెయ్యిలో వణుకు వస్తుంది.

కేసీఆర్ గాంధీకి పోయి పరామర్శించడం కాదు అక్కడే వైద్యం ఎందుకు తీసుకోలేదని అడగడం తప్పుకాదు. “నీకేమో కులస్థుల కార్పొరేట్ దవాఖాన మాకేమో గాంధీనా” అనీ అడగొచ్చు. తెలంగాణ సమాజం మర్చిపోయిన విషయం. మీడియా ఫాలోఅప్ లేని విషయం ఒకటుంది. అన్ని ప్రయివేట్ అస్పత్రుల్లో 50% బెడ్లు గవర్నమెంట్ కు కేటాయించాలనే ఒప్పందం ఒకటి ప్రభుత్వానికి ప్రయివేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ మధ్య అయింది. దాని సంగతి ఏడబోయింది? ప్రభుత్వం ఒక రేట్ కార్డ్/ప్రైస్ సీలింగ్ నిర్ణయించింది. అయినా లక్షలకు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఈ విషయాలు ప్రభుత్వాలకి తెలియదు అంటే మనం నమ్మాలా? గట్టిగా అడగడానికి మనకు చేతకాదు. ప్రభుత్వానికి చర్యలు తీసుకునే దమ్ములేదు. వాళ్లకేవో గుల్దస్తాలు, గులాబ్ జామున్లు అందుతాయి కదా.

“జిల్లాకో నిమ్స్ తరహా ఆసుపత్రి, నియోజకవర్గానికో వంద పడకల ఆసుపత్రి, మండలానికో ముప్పై పడకల ఆసుపత్రి” అన్నాడు పాలకులు. ఏనాడైనా దీనిపై అడిగామా? ‘కేజీ నుండి పీజీ ఉచిత విద్య’ దాని సంగతి అడిగామా?

సివరాకర్నా సిన్నమాట: ప్రశ్నించడం చేతగాని ప్రజలున్నప్పుడు, పనిచేతగాని ప్రభుత్వాలే ఉంటాయి. ఎచ్చులే పనిగా ప్రచారమవుతాయి. ప్రశ్న ఒక ముల్లుగర్ర. రాజ్యాంగం పౌరులకు హామీపడిన ఆయుధం.

-అరుణానక్