
ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఏపీపై బాగా పడుతోంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కేసులు విజృంభిస్తున్నాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా శనివారం రికార్డు స్థాయిలో 20.11శాతం పాజిటివిటీ నమోదు కావడం ఏపీ ప్రజలను షాక్ కు గురిచేస్తోంది. దీన్ని బట్టి ఏపీలో పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరు వైరస్ బారిన పడినట్లైంది.
ఏపీలో శనివారం నిర్వహించిన 35వేల పరీక్షలకు 7224 కేసులు బయటపడ్డాయి. అంటే ప్రతి 100 మందిలో 20 మందికి వైరస్ సోకినట్టు లెక్కు. చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లోనే 67శాతం కేసులు నమోదయ్యాయి. లక్ష వరకు పరీక్షలు చేస్తే కేసుల సంఖ్య ఇంకా బయటపడొచ్చని చెబుతున్నారు. వైరస్ సోకిన వారిని.. వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి చికిత్స చేస్తే వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుంటుంది.
ఒక్కసారిగా కేసులు పెరిగితే పడకలు దొరక్కపోవడంతో పాటు కొత్త సమస్యలూ తలెత్తే అవకాశం ఉంది. ఏపీలోని ఆస్పత్రులన్నీ ఇప్పుడు కరోనా బాధితులతో నిండిపోయాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కూడా నిండుకుంది. దీంతో ప్రజాప్రతినిధులు, బడాబాబులు అంతా హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇక్కడ మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు.
నిజానికి ఏపీలో ఇంకా ఎక్కువే కేసులు నమోదవుతాయి. కానీ ట్రేసింగ్ లను అస్సలే చేయడం లేదు. గత సంవత్సరం ఒక్కరికి కరోనా పాజిటివ్ వస్తే అతడు కలిసిన వారందరినీ.. కుటుంబానికి పరీక్షలు చేసి క్వారంటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు లక్షణాలు కనిపిస్తేనే వారిని టెస్టు చేస్తున్నారు. దీంతో వారంతా కరోనా వాహకాలుగా మారి వ్యాపింపచేస్తున్నారు.