తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెరపైకి వచ్చిన షర్మిల.. రోజుకో జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ నానా హంగామా చేస్తున్నారు. అయితే..ఆ హంగామాకు కరోనా బ్రేకులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో బహిరంగ సభకు ఇచ్చిన అనుమతుల్ని అధికారులు రద్దు చేస్తున్నారు. హైదరాబాద్‌లో గో మహాగర్జన అనే కార్యక్రమాన్ని చేపట్టాలని కొన్ని సంస్థలు అనుకున్నాయి. ముందుగా పర్మిషన్ కూడా తీసుకున్నాయి. హఠాత్తుగా ఆ కార్యక్రమానికి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కరోనా విజృంభణను కారణంగా చూపించారు.
దీంతో వచ్చే నెల 9న షర్మిల ఖమ్మంలో పెట్టాలనుకుంటున్న సభపైనా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అందుకోసం పోలీసులకు అనుమతి దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ కరోనా ఆంక్షలు పెట్టారు. ఆరు వేల మంది మాత్రమే రావాలని.. కరోనా నిబధనలు అన్నీ పక్కాగా పాటించాలని సూచించారు. ఇవన్నీ ఫార్మాలిటీగా చేసే సూచనలు . రాజకీయ పార్టీలు పాటిస్తాయా లేదా అన్న విషయం అందరికీ తెలుసు.
మరోవైపు.. ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగున్నాయి. ఖమ్మంలోనూ అదే పరిస్థితి. షర్మిల సభకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు ఆ జిల్లాలో కేసుల సంఖ్య పెరిగితే సభకు పర్మిషన్ రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదేసమయంలో.. షర్మిలకు తెలంగాణ ప్రభుత్వ పెద్దల అండ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం సభకు అనుమతిని కూడా టీఆర్ఎస్ పెద్దల స్పెషల్ ఇంట్రెస్ట్‌తోనే ఇచ్చారన్న ప్రచారం ఇప్పటికే తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉంది.
వీటన్నింటి నేపథ్యంలో షర్మిల సభకు ఏ కరోనా అడ్డంకి కాబోదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎలా అయినా లక్ష మందితో సభ నిర్వహించి తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా ప్రచారం చేసుకోవాలని.. షర్మిల పార్టీ వ్యూహకర్తలు పట్టుదలతో ఉన్నారు. పార్టీ పేరు.. జెండా అదే రోజు ప్రకటించనున్నారు. ఒకవేళ కరోనా వల్ల సభ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే.. షర్మిలకు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పరిస్థితి మారిపోతుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్