త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సీటుకు ముక్కోణపు పోటీ నెలకొంది. గతంలో లాగా.. వైసీపీ, టీడీపీ మధ్య పోటీ అన్నట్లుగా లేకుండా పోయింది. ఎట్టకేలకు బీజేపీ–జనసేన దూసుకు రావడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు గిలగిలలాడుతున్నాయి. కూటమి తరఫున రత్నప్రభ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారింది. విపక్ష టీడీపీ, బీజేపీ–-జనసేన అభ్యర్థులతో పోలిస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి రికార్డు మెజారిటీ సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మేరకు సీఎం జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు కూడా.
అయితే.. జగన్ అనుకుంటున్న ఆ రికార్డు మెజార్టీ సాధ్యపడుతుందా..? విపక్ష టీడీపీ, బీజేపీ–-జనసేన మధ్య ఓట్ల చీలిక ఆయనకు లాభించబోతోందా..? అదే జరిగితే మున్సిపల్ ఎన్నికల ఫీట్‌ను వైసీపీ రిపీట్ చేయడం ఖాయమా..? అనే సందిగ్ధం నెలకొంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో జరుగుతున్న తిరుపతి ఉపఎన్నిక ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపు కొనసాగించక తప్పని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా విపక్షాలు తమను ఆడుకోవడం ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే తిరుపతిలో తామే గెలవబోతున్నామని, మెజార్టీలో రికార్డు సృష్టించడమెలా అన్న దానిపై దృష్టిపెట్టినట్లు చెప్పుకుంటోంది.
ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో సైతం కుదేలైంది. దీనికి ప్రధాన కారణం జనసేన. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తా చూపలేకపోయిన జనసేన.. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో విజయాల తర్వాత కాపు ఓటు బ్యాంకు పోలరైజ్ కావడం మొదలైంది. దీని ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో మరింత పెరిగింది. ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపిందంటే పలుచోట్ల టీడీపీ అభ్యర్థుల్ని దాటి జనసన అభ్యర్థులు విజయాలు అందుకున్నారు. ఇంకొన్ని చోట్ల వైసీపీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు.
అయితే… ఇప్పుడు తిరుపతిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక జరుగుతున్న లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల జనసేనకు ప్రభావం చూపే స్థాయిలో ఓట్లు ఉన్నాయి. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల్లో బలిజ ఓటు బ్యాంకు బలంగా ఉంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల తరహాలో వీటిని పోలరైజ్ చేసే ప్రయత్నంలో జనసేన కూడా బిజీగా ఉంది. అదే జరిగితే ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ టీడీపీకి లేదా వైసీపీకి పడిన ఈ ఓట్లన్నీ ఈసారి బీజేపీ–-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన రత్నప్రభ ఎగరేసుకుపోవడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే టీడీపీ ఖాతాలో మరో ఘోర పరాజయం తప్పదన్న అంచనాలున్నాయి. మొత్తంగా జనసేన ఓటు బ్యాంకు పెరగడంతో అది కాస్త టీడీపీకి మైనస్ కాబోతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్