Visakhapatnam Coast: విశాఖపట్నం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వల వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. పెద్ద జాలరి పేట, వాసువారి పాలెం గ్రామస్తుల నడుమ పెద్ద గొడవ జరుగుతోంది. రింగువల వలల వల్ల తాము నష్టపోతున్నామని సాంప్రదాయ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాసువారి పాలెం గ్రామస్తులు మొత్తం పెద్ద జాలరిపేట తీరం వద్దకు చేరుకున్నారు.
దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వాసువారి పాలెం గ్రామస్తులకు చెందిన రెండు బోట్లను పెద్ద జాలరిపేట గ్రామస్తులు తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున తీరం వద్దకు చేరుకుని మోహరించారు. రింగు వలల కారణంగా మత్స్య సంపద నాశనం అవుతోందని పెద జాలరిపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బీజేపీకి గట్టి షాకిచ్చిన కేసీఆర్.. ఏకంగా జేపీ నడ్డాకే ఝలక్
అయితే తాము హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని, తీరానికి దూరంగానే వేటాడుతున్నామని వాసువారిపాలెం మత్స్యకారులు చెబుతున్నారు. కానీ పెదజాలరిపేట గ్రామస్తుల వాదన ప్రకారం.. తీరానికి దగ్గరలోనే వారు వేటాడుతున్నారని ఇలా అయితే తాము ఎలా బతకాలంటూ ఆవేదన తెలుపుతున్నారు. ఇదే వివాదం గతేడాది కూడా నెలకొని పెద్ద సంచలనం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వార్తగా ఉంది.
ఇప్పుడు మరోసారి ఈ వివాదం తెరమీదకు రావడంతో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. కాగా మత్స్యకారులతో రేపు మంత్రి సీదిరి అప్పలరాజు సమావేశం కానున్నారు. ఆయన మరోసారి వారితో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ తీరం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కోతల రాయుడు పెదరాయుడు అవుతాడా ?