Homeఆంధ్రప్రదేశ్‌అంతర్వేది వివాదం.. అసలు ఈ ఆలయ చరిత్ర తెలుసా? 

అంతర్వేది వివాదం.. అసలు ఈ ఆలయ చరిత్ర తెలుసా? 

Antarvedi temple history
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అంతర్వేది ఆలయ ఘటన హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎంతసేపూ అక్కడి రథం కాలిపోయింది అంటూ వార్తలు చూస్తున్నామే తప్ప.. ఎక్కడా ఆ ఆలయ చరిత్రను చూడలేదు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆ ఆలయ చరిత్ర ఇలా ఉంది..

సఖినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో ఉంటుంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు.సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశీగానూ పేరొందింది. కాశీకి వెళ్లలేని వారు ఒకసారి అంతర్వేది వెళ్లి వస్తే చాలని భక్తులు అంటుంటారు. ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవచ్చు. సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పగా.. బ్రహ్మ రుద్రయాగం కోసం ఈ  ప్రదేశాన్ని ఎన్నుకుకుంటున్నారు. శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని పురాణాల్లో చెబుతుంటారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.

Also Read: తిరుమల డిక్లరేషన్ వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున చాలా ఏళ్లు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిచగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయాన్ని గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడట.

ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు. ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినప్పుడు అది ఈ ప్రాంతంలో పడిందని.. అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో ఉంది.

శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది. ద్వాపర యుగంలోనూ పాండవ మధ్యముడు అర్జనుడు తీర్థయాత్రలు చేస్తూ ‘అంతర్వేది’ని దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన ‘విజయయ విలాసము’లోనూ, శ్రీనాథ కవిసార్వభౌముడు ‘హరివిలాసం’లోనూ వర్ణించారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీ.శ.300 ఏళ్లకు పూర్వం నిర్మించిందని తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్లీ నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది. నేడు ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది.

Also Read: రైతుల కోసం మోడీతో ఢీకొంటున్న కేసీఆర్

సముద్రతీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం ఉంది. ఈ ఆశ్రమాన్ని కమలం ఆకారంలో నాలుగు అంతస్థులతో నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో కనిపిస్తుంది. దగ్గరలో ధ్యానమందిరం, యోగశాల మొదలైనవి ఉన్నాయి. పర్ణశాలలో యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆధునికంగా నిర్మతమైన ఈ వశిష్ఠాశ్రమం కూడా దర్శనీయ స్థలమే! అన్నాచెల్లెళ్లగట్టు సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసేచోటును అన్నాచెల్లెళ్ల గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటు వైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగుల్లో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూడాంబికాలయం ఉంది.

రాజమండ్రి నుంచి రాజోలు మీదుగా సఖినేటిపల్లికి చేరుకోవచ్చు. నరసాపూర్ వచ్చి అక్కడి నుంచి గోదావరిపాయ పడవలో దాటి సఖినేటిపల్లి రావచ్చు. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు. ఏటా మాఘమాసంశుద్ధ సప్తమి నుంచి బపుళ పాఢ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశినాడు స్వామివారి రథోత్సవం ఉంటుంది. వైశాఖమాసంలో శుద్ధ చతుర్దశినాడు లక్ష్మీనృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని సంతానం లేని వారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడే ఉండి.. రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పండ్లు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular