YS Viveka case : వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. అయితే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతున్న వేళ.. ఆయన పులివెందుల వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతున్న వేళ మరో రెండు రోజుల పాటు పులివెందులలో గడపనున్నట్టు ఎంపీ ప్రకటించడం వెనుక రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అవినాష్ రెడ్డి ప్రకటనలు ఉన్నాయి. దీంతో నాటకీయ పరిణామాలు జరిగే చాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ..
ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు రిమాండ్ లో ఉన్న నిందితులందర్నీ సీబీఐ విచారించింది. ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం ఇప్పటివరకూ ఆరుసార్లు విచారించింది. వివేకా రెండో భార్య షమీమ్ వాంగ్మూలం పేరిట మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆమెను సైతం సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. అటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఇటు షమీమ్ లేవనెత్తిన అంశాలు, అనుమానాల నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను సైతం సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. మరోవైపు ముందస్తు బెయిల్ విచారణపై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. మంగళవారం విచారణ సాగుతుందని భావించినా.. సుప్రీం కోర్టు ఉత్తర్వులు రాకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది. ఈ తరుణంలో పిటీషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉండడం చర్చనీయాంశంగా మారింది.
స్వరం మార్చిన అవినాష్..
అయితే వివేకా హత్య ఘటనలో తనకు కానీ.. తన కుటుంబానికి కానీ సంబంధమే లేదని ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా ప్రకటించారు. వివేకా కుమార్తె సునీత రోజుకో మాట మార్చుతుండడాన్ని గుర్తుచేశారు. ఆ రోజు రాసిన లేఖ మాయం కావడం వెనుక తమ హస్తం లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేయడం వల్లే తనకు ఈ సమస్యలు చుట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ 15 నిమిషాల పాటు ఫోన్ రావడం ఆలస్యం అయి ఉంటే తమ మీద ఈ అభియోగాలు వచ్చి ఉండేవి కావన్నారు. తనతో పాటు కుటంబంపై కుట్ర జరుగుతోందని.. దస్తగిరితో బలవంతంగా లేఖ రాయించడంతోనే ఈ విషయం బయటపడిందన్నారు.
పులివెందులో ప్రజాదర్బార్..
అటు సీబీఐ తనను అరెస్ట్ చేస్తుందన్న ప్రచారంపై అవినాష్ రెడ్డి స్పందించారు. అంతా దైవాధీనం అని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి వాడినో జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. ధర్మమే తనను కాపాడుతుందన్నారు. అయితే అవినాష్ స్వరంలో చేంజ్ రావడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను రాజశేఖర్ రెడ్డి ఉంచమన్నందునే పోలీసులకు తాము ఇవ్వలేదని పలుమార్లు అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ లేఖ గురించే తెలియదని చెబుతుండడం గమనార్హం. అటు తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ విచారణకు రానుండడం.. అదే సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులలో ఉండడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.