MP Raghurama Krishnam Raju: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీకి కొరకరాని కొయ్యలా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టార్గట్‌గా వైసీపీ సర్కార్ పెద్ద కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణ చేశారు. ఇందుకు కొన్ని అంశాలను కూడా ఆయన ఉదహరించారు. ఇప్పుడు ఇవి ఆంధ్రాలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే పవన్‌పై రెక్కీ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

కాపు రిజర్వేషన్లు అమలు చేయకుండా..
కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు, సుప్రీం కోర్టులు ఎలాంటి స్టే ఇవ్వనప్పటికీ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోలేదు. కాపు రిజర్వేషన్ అంశాన్ని అడ్డుపెట్టుకునే జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు కాపు రిజర్వేషన్ అంశాన్ని పవన్ కళ్యాణ్ తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు ఎంపీ రఘురామ ఒకవేళ అదే జరిగితే శాంతి భద్రతల సమస్య వస్తుందని హెచ్చరించారు.
ఈడబ్ల్యూఎస్‌కు అమలుకు పచ్చ జెండాతో..
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇకనైనా జగన్ మొసలి కన్నీరు కార్చడం మాని కాపులకు జరిగిన అన్యాయాన్ని కొద్దిలో కొద్దిగానైనా సరి చేయాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడుల వనుక గూడుపుఠాణి..
రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల వెనుక పెద్ద గూడుపుఠాణి దాగి ఉందన్న అనుమానాన్ని ఎంపీ వ్యక్తం చేశారు. 50 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు ఎవరైనా ప్రతిపాదిస్తారా.. ఎవరైనా అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. సూర్యుడు ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే 50 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరాకు ఎంత నెట్వర్క్ కావాలి.. అంత విద్యుత్ సరఫరా డిస్ట్రిబ్యూషన్ అనేది సాధ్యమేనా అన్నారు. ప్రమోటర్ కంపెనీ చూస్తే అంత పెట్టుబడులు పెట్టేదిగా లేదని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగీకరిస్తుందని విస్మయం వ్యక్తం చేశారు.
తనలాగే పవన్‌పై కుట్ర..
తనని హింసించినట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తప్పుడు కేసులు బనాయించి హింసించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ఆరోపించారు రఘురామ. అదే జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్‌పై తప్పుడు కేసులను బనాయించాలనే ఆలోచనలు విరమించుకోవాలని సూచించారు. ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు స్థలం ఇచ్చారన్న కారణంగానే రోడ్డు విస్తరణ పేరిట గ్రామంలోని జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేసినట్లుగా ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై తప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.
విశాఖ అంటే ఎందుకంత ప్రేమ..
రాజధాని గ్రామమైన ఇప్పటంపై ఆగ్రహంతో రగిలిపోతున్న వైసీపీ పెద్దలకు విశాఖపట్నం అంటే ఎందుకంత ప్రేమ అన్నది జగమెరిగిన సత్యమేనని అన్నారు. విశాఖలో అడ్డగోలుగా భూములు కొనుగోలు చేసి తమ భూదాహాన్ని తీర్చుకోవాలని భావిస్తున్న ప్రభుత్వ, తమ పార్టీ పెద్దలు.. ఆ భూముల విలువను పెంచుకోవడానికి విశాఖపట్నం వెళ్లేందుకు ఆరాటపడుతున్నారని ఆరోపించారు. శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా శాశ్వతంగా ఉండే పాస్ పుస్తకాలపై, కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండే జగన్ తన ఫొటోలు ముద్రించుకోవాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాచరిక వ్యవస్థలోనూ ఇలాంటి ఆలోచనలను ఆనాటి ప్రభువులు చేయలేదన్నారు. తమ పేర్లతో పథకాలను ప్రవేశపెట్టడం, తమ ఫొటోలను ముద్రించుకోవడం, వీధి వీధిలో విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం చూస్తుంటే విస్మయం కలుగుతోందన్నారు.