Pawan Kalyan- Ippatam Issue: ఆంధ్రా పాలిటిక్స్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ హీటెక్కిస్తున్నారు. అధికార వైసీపీకి గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. ఎక్క ఎమ్మెల్యే కూడా లేని జన సేనాని సంధిస్తున్న రాజకీయా బాణాలను ఎదుర్కోవడం జగన్ సర్కార్‌కు ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈలోగా ప్రత్యామ్నాయంగా ఎదగడమే కాకుండా.. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జన సేనాని పావులు కదుపుతున్నారు.

తొలుత బలమైన నేతలపై దృష్టి..
అధికారంలో ఉన్న జగన్ సారథ్యంలోని వైసీపీని వచ్చే ఎన్నికల నాటికి వీలైనంత బలహీన పర్చడమే లక్ష్యంగా జన సేనాని దూకుడు పెంచారు. ఇందులో భాగంగా అధికార పార్టీకి చెందిన బలమైన నేతలను ఎలా ఓడించాలన్న అంశంపై దృష్టిపెట్టారు. ఈమేరకు వైఎస్సార్ సీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలలో బలమైన వారిని గుర్తించారు. ఇందులో కొడాలని నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వంశీ, ఇలా సుమారు 50 మంది వరకు గుర్తించారు. వారిని ఆయా నియోజకవర్గాల్లోనే వచ్చే ఎన్నికల్లో ఎలా దెబ్బకొట్టాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్. బలమైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు.
అధికార పార్టీలో అసంతృప్తులకు గాలం..
మరోవైపు అధికార వైసీపీలో ఉండి.. సరైన గుర్తింపు ప్రాధాన్యం దక్కని నేతలపైనా జన సేనాని ఫోకస్ పెట్టారు. క్యాడర్ నుంచి లీడర్ వరకూ అసంతృప్తులను జన సేనలోకి తీసుకువచ్చే ప్రయత్నాలనూ పవన్ మొదలు పెట్టారు. ఈ బాద్యతను నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. ఇప్పటికే కొడాలని నాని సొంత నియోజకవర్గం గుడివాడకు చెందిన నాయకులను జనసేనలో చేర్చుకున్నారు. ఎంపీ భరత్ నియోజకవర్గంలోని కీలక నేతలను జనసేనలోకి రప్పించడంలోనూ జన సేనాని సక్సెస్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గాన్ని జన సేనాని టార్గట్ చేశారు. ఇంకా అనేక నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్‌ను జనసేన నేతలు ఆకర్షిస్తున్నారు.
అమరావతి ఏరియాపై దృష్టి..
తాజాగా జన సేనాని తన దృష్టి అమవావతి ఏరియా నియోజకవర్గాలపై సారించారు. రాష్ట్రంలో జనసేనకు బలం ఉన్న జిల్లాల్లో కృష్ణా, గుంటూరు కూడా ఉన్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలతో కృష్ణ, గుంటూరులోనూ జనసేన బలపడుతోంది. ఈ జిల్లాలో కాపుల ఓట్లు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ జనసేనకు బలం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన 20 వేల పైనే ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గాలపైనే పవన్ కల్యాణ్ ఫోకస్ చేసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల ఆధారంగా..
గత ఎన్నికల్లో అమరావతి చుట్టూ ఉన్న మంగళగిరి, గుడివాడ, గన్నవరం, సత్తెనపల్లి, కైకలూరు, అవనిగడ్డ, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, బాపట్ల తదితర నియోజకవర్గాల్లోనూ కాపులు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులు చెప్పుకోదగిన ఓట్లు సాధించారు. తాజాగా ఆ స్థానాలపైనే పవన్ మళ్లీ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా అమరావతి చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని జన సేనాని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అమరావతి రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చడంపై ఆందోళన చేశారు. బాధితులకు రూ.లక్ష చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే కనీసం నాలుగు స్థానాల్లో అయినా పోటీచేసి గెలవాలని జనసేనాని భావిస్తున్నారు. పొత్తు లేకపోయినా గెలిచే నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నారు.
పవన్ ప్రత్యేక దృష్టి..
ఈమేరకు పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి…గ్రామ, మండల స్థాయి కమిటీలని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం పెడన, గుడివాడ, కైకలూరు, విజయవాడ నగరంలోని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో గన్నవరం, గుడివాడ వైసీపీకి బలమైన నియోజకవర్గాలు కావడంతో ఇప్పటికే అక్కడ బరిలో నిలిపే అభ్యర్థులనూ ఎంపిక చేశారు. తాజాగా మంగళగిరిపైనా దృష్టిపెట్టారు.