https://oktelugu.com/

KCR vs Congress : కేసీఆర్‌ను ‘బీసీ’ రిజర్వేషన్లతో కొడుతున్న కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నికల్లో గెలవాలంటే బీసీలే కీలకం. ఈ నేపథ్యంలో గతం కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించే ఆలోచన కూడా జరుగుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనలో ఒకటి, రెండు వర్గాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం బీసీల్లో బలంగా ఉంది.

Written By: , Updated On : June 22, 2023 / 08:16 AM IST
Follow us on

KCR vs Congress : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలెరిగి వాతపెడుతున్నట్లు బీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉన్న అంశాలను కాంగ్రెస్‌ బలంగా మార్చుకుంటోంది. ఎన్నికల్లో కేసీఆర్‌ను దెబ్బ కొట్టే అస్త్రాలుగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో ఎన్నికల సమరశంఖం పూరించింది. సామాజిక సమీకరణలు బలంగా పని చేసే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పునాదులపై దెబ్బ కొట్టేలా అడుగులు వేస్తోంది.

పాజిటివ్‌గా యూత్‌ డిక్లరేషన్‌
ఇప్పటికే యూత్‌లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకునేందుకు ప్రకటించిన డిక్లరేషన్‌ పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్‌ చేసే బీసీ డిక్లరేషన్‌పై ఫోకస్‌ పెట్టింది. బీసీలకు అండగా నిలుస్తూ..వారి మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతోంది. బీసీ డిక్లేరేషన్‌లో కీలక అంశాలు ఉంటాయని తెలుస్తోంది.

– రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని యోచిస్తోంది.

– త్వరలో సూర్యాపేటలో బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేలా ఆలోచన చేస్తోంది.

– యూత్‌ డిక్లరేషన్‌ను ప్రియాంక ప్రకటించటంతో యువతలో నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే తరహాలో బీసీ డిక్లరేషన్‌కు ప్లాన్‌ చేస్తోంది.

– తాము ప్రకటించిన తరువాత బీఆర్‌ఎస్, బీజేపీ ఏం చేసినా బీసీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. బీఆర్‌ఎస్‌ తమ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏదైనా చెప్పినా తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేయని పార్టీగా ఇప్పటికే ముద్ర పడిందని.. ఇక నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు.

26 కులాలను బీసీలో చేర్చే ఆలోచన..
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే హామీ ఇస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల న్యాయమైన డిమాండ్లను కూడా చేర్చుతామని చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకొంటామని ప్రకటకు సిద్ధమవుతున్నారు. బీసీ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో బీసీ సంఘాల ముఖ్యుల అభిప్రాయాలకు విలువ ఇచ్చేలా వారికి భాగస్వామ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది.

రూ.లక్ష సాయం కొందరికే ఎందుకు..
తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు లక్ష సాయం ప్రకటన కూడా మోసపూరితమని ప్రచారం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 139 కులాలు బీసీల్లో ఉంటే కేవలం 14 బీసీ కులవృత్తులకే లక్ష సాయం ఇస్తామనడం మోసం చేయడమే అనేలా ప్రజలకు వివరించాలని భావిస్తోంది. లేదంటే 130 కులాలకు ఈ స్కీమ్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

బీసీ డిక్లరేషన్‌ గెలుపుకు బాట..
తెలంగాణ ఎన్నికల్లో గెలవాలంటే బీసీలే కీలకం. ఈ నేపథ్యంలో గతం కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించే ఆలోచన కూడా జరుగుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనలో ఒకటి, రెండు వర్గాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం బీసీల్లో బలంగా ఉంది. అదే సమయంలో బీజేపీలోనూ అదే తరహాలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఒక్కో వర్గం సమస్యల పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. బీసీలకు 50 శాతం టికెట్లు దిశగా ఆలోచన జరుగుతోంది. ఇక బీసీ డిక్లరేషన్‌ పూర్తయిన తరువాత మహిళలు.. రైతుల అంశాల పైన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ బీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని భావిస్తోంది.