Gruhalakshmi Scheme: దేశంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉన్న నిరుపేదలకు గృహలక్ష్మి పథకం పేరుతో ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ పథకంలో భాగంగా ఒక్కో లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీ,చాలని జీతాలతో బతకలేక ఆర్థిక ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు సొంత ఇల్లు నిర్మించే పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా సొంత ఇల్లు స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మేరకు రహదారులు, భవనాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాయం 100 శాతం రాయితీతో అందించనున్నట్లు ప్రకటించింది.
ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి సాయం..
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గృహలక్ష్మి పథకంలో భాగంగా పెద్ద ఎత్తున లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని లక్షలాది మందికి ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మంది లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందించనున్నారు. జిల్లాలోని కలెక్టర్ల ఆధ్వర్యంలో, జిహెచ్ఎంసి పరిధిలో అయితే కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలు కానుంది. ఈ పథకానికి ఆయా అధికారులే నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. మహిళలు పేరు మీదే గృహలక్ష్మి ఆర్థిక సాయం అందనుంది. ఇందుకోసం లబ్ధిదారులు మహిళల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను అధికారులు రూపొందించారు. రెండు గదులతో కూడిన ఆర్సిసి నిర్మాణం కోసం ఆర్థిక సాయం ఇవ్వనున్న ప్రభుత్వం ఇంటి బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహార భద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్నవారిని ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల్లో విభజన..
ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మంది లబ్ధిదారులకు ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలు 20 శాతం మందికి ఈ పథకంలో భాగంగా సాయం అందించనున్నారు. అలాగే, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. గృహలక్ష్మి కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వాటిని పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో దశలు వారీగా గృహలక్ష్మిని వర్తింపజేస్తారు. ఆర్థిక సాయం అందించగా మిగిలిన దరఖాస్తులను పరిశీలించి దశల వారీగా వారికి కూడా ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. గృహలక్ష్మి పథకం అమలు కోసం ప్రత్యేకంగా పోర్టల్, మొబైల్ అప్లికేషన్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. తాజా పథకం పట్ల సాధారణ, మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది.