Congress Protest: కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యల పరిష్కారానికి దూకుడు పెంచుతోంది. ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో తమ ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చింది. దీంతో పోయిన పరువు నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. నాయకత్వ పోరులో భాగంగా సీనియర్లు పార్టీకి సహకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో ప్రజా సమస్యలను ప్రస్తావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దుయ్యబట్టేందుకు సంసిద్ధమైంది. ఈ మేరకు పార్టీ శ్రేణులను కూడా పాల్గొనాలని సూచించింది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరు విధిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Minister Anil Kumar Yadav: ఆ నోరు వినిపించదేం?.. సైలెంట్ అయిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్
పెట్రో ధరలు, గ్యాస్ ధరల పెంపు, రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంపు అంశాలపై ప్రధానంగా పోరాటం చేయాలని సూచించింది. మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని తెలియజేసేందుకు ప్రజల పక్షాన నిలబడి ఆందోళన చేసేందుకు రెడీ అయింది. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందజేయాలని అధిష్టానం సూచించింది.
ఇదివరకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమై విభేదాలు దూరం పెట్టి పార్టీ కోసం పని చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ ధర్నాపై అందరి దృష్టి పడుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు గొడవలకు పోకుండా సఖ్యత పాటిస్తారా? లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తిస్తారో తెలియడం లేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటుందో తేలాల్సి ఉంది.
హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్ల ముందు ధర్నా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంసిద్ధమవుతున్నారు. ఆందోళన విజయవంతం చేసి పార్టీ ప్రతిష్ట పెంచాలని భావిస్తున్నారు. దీని కోసమే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ధర్నాల నిర్వహణపై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతారా? లేక వారి విభేదాలకు బలవుతారా అనేది తేలాల్సి ఉంది.
Also Read:Arrest Warrant On MLA Roja Husband: రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్.. ఆ కేసులో అలా చేశారంట