Minister Anil Kumar Yadav: ఆయన నోరు తెరిస్తే మాటల తూటాలు. విపక్షాలకు ముచ్చెమటలు. పంచ్ లు వేస్తే అపోజిషన్ నాయకులకు పంచెలు తడిసిపోతాయి. అధినేతకు ఒక మాటంటే పది మాటల తూటాలతో కౌంటర్లు. అటువంటి వ్యక్తి ఉన్నపలంగా సైలెంట్ అయిపోయారు. ఎక్కడున్నారో తెలియడం లేదు. సచివాలయం వంక చూడడం లేదు. అయన ఎవరనుకుంటున్నారా? అదేనండీ మన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విపక్షాలు ముద్దుగా నోటిపారుదల శాఖ మంత్రి అంటూ చమత్కరిస్తుంటారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి నడిచిన నాయకుల్లో అనీల్ కుమార్ యాదవ్ ముందంజలో ఉంటారు.
వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు నుంచి జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. దూకుడుగా వ్యవహరించే వారు. అటువంటి ధోరణి ఉంటే మన జగన్ గారికి ఇట్టే ఇష్టపడిపోతారు కదా. ఏకంగా తన కేబినెట్ లోకి తీసుకొని అనీల్ యాదవ్ ను ఏకంగా నీటి పారుదల శాఖనే కేటాయించేశారు. ఇదేంటి సామీ మన సామాజికవర్గం ఉండగా.. వెనుకబడిన తరగతులు, అందునా యాదవ సామాజికవర్గానికి పదవి కట్టబెట్టారంటూ సీఎం జగన్ సామాజికవర్గీయులు తెగ బాధపడిపోయారు. కానీ అనీల్ కుమార్ యాదవ్ ఇదేమీ పట్టించుకోకుండా తనకిచ్చిన మంత్రి పదవినే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. శాఖపరంగా ఆశించిన స్థాయిలో పురోగతి లేకున్నా.. విపక్షాలపై నోరు పారేసుకోవడంలో ముందంజలో ఉంటారన్న టాక్ బాగానే ఉంది. అధినేత ఇచ్చిన టాస్క్ ను ఇట్టే పూర్తిచేసి ఆయన మనసును దోచుకునే వారు.
Also Read: Arrest Warrant On MLA Roja Husband: రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్.. ఆ కేసులో అలా చేశారంట
ఎంతలా అంటే శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై షటైర్లు మీద షటైర్లు వేసినప్పుడు ‘ఉండవయ్యా అనీల్ నవ్వలేక చస్తున్నా’నని సీఎం జగన్ అనేంత వరకు. మన అనీల్ జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ పై వీరవిహారం చేసేవారు. ఒక విధంగా ఛెప్పాలంటే జగన్ కేబినెట్ లో బూతుల శాఖ మంత్రిగా కొడాలి నాని తరువాత అనీల్ కుమార్ యాదవే ఉండేవారు. కేబినెట్ లో ‘సరైనోడు’ అని పిలుచుకునే అనీల్ ఇటీవల తెగ సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా సచివాలయంలోని తన కార్యాలయానికి రావకపోవడం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నిత్యం అధినేత వెంట అంగ రక్షకుడిగా ఉండే మన అనీల్ ఏమయ్యాడంటూ సహచరులు చర్చించుకుంటున్నారు.
పక్కలో బల్లెంలా రెండు వర్గాలు
వాస్తవానికి మంత్రి అనిల్ కుమార్ కు సొంత జిల్లా నెల్లూరులో పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు. అక్కడ అనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి వర్గాల సెగ బాగానే తగులుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనీల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా ఆ రెండు వర్గాలు పనిచేయడం ప్రారంభించాయి. అసమ్మతిని ఎగదోస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత చూసి ఇక సైలెంట్ అవ్వడం మంచిదన్న నిర్ణయానికి అనీల్ వచ్చారట. ఇక రేపో మాపో ఆయన మాజీ మంత్రి కావడం ఖాయం.
ఎందుకైనా మంచిది తన జాగ్రత్తలో తాను ఉంటానని అనుచరుల వద్ద చెబుతున్నారట. పార్టీ అన్న, అధినేత జగన్ అన్న తనకు దైవంతో సమానమని.. కానీ సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని తెగ బాధపడుతున్నారట. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారితే టార్గెట్ అయ్యే నేతలో అనీల్ ముందు వరుసలో ఉంటారు. అటు విపక్షాలకు, అటు సొంత పక్షంలో వారికి నేనే టార్గెట్ అవుతున్నానని తెగ బాధపడుతున్నారట.
కానీ మూడేళ్లలో ఆయన చిన్నా, పెద్దా తేడా లేకుండా వాగిన వాగుడు ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఆయనకు రాజకీయ ప్లాట్ ఫారం కల్పించిందే ప్రజారాజ్యం పార్టీ. అటువంటిది పవన్ కళ్యాణ్ మీద ఆయన విరుచుకుపడిన తీరు అందరికీ విధితమే. రాజకీయాలను వదిలి పవన్ నటించిన సినిమాలపైనా కామెంట్ చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కానీ కాలం, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయన్న కనీస లాజిక్ లేకుండా అనీలన్న వీరవిహారం చేశారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి సైలెంట్ అయ్యారు. ఇంత బతుకు బతికి నాకు ఇదేమి పరిస్థితి అంటూ అనం, కాకాని వర్గాల మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అసలు క్లారిటీ వచ్చింది. ఇంతలో మంత్రి పదవి పోవడం ఖాయం కావడంతో ఇక నోరును అదుపులో పెట్టుకోవడమే ఉత్తమమని భావించిన మన ‘నోటి’ పారుదల శాఖ మంత్రిగారు నెల్లూరులోని తన సొంత ఇంటికే పరిమితమయ్యారన్న గుసగుసలు తెగ వినిపిస్తున్నాయి.
Also Read:Sri Lanka Crisis 2022: శ్రీలంక దుస్థితికి చైనాయే ప్రధాన కారణమా?