Election Results 2024: కాలానుక్రమంలో ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో ఎన్నికల ప్రక్రియ కూడా ఒకటి. గతంలో మన దేశంలో ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ విధానంలో జరిగేవి. రాను రాను జనాభా పెరగటం.. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు పెరగడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఉంటే బట్టలు ఉన్న అంతటి అమెరికా కంటే కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనదేశంలో ఎన్నికల నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతున్నప్పటికీ.. ఓటింగ్ మిషన్లను హ్యాకింగ్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ.. అధికారం కోల్పోయిన వారు విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. 2014 నుంచి మనదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రెండు పర్యాయాలు సొంతంగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. మూడోసారి మాత్రం మిత్రపక్షాల సహాయంతో అధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ విధానం లోపభూయిష్టమని ఆరోపించడం ప్రారంభించాయి. అయితే ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ కూడా ఈవీఎంల పని తీరుపై కూడా ఆరోపణలు చేయడం విశేషం.
ఇప్పుడు ఆ మాట అనరు..
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు దక్కించుకొని… ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. గత ఎన్నికలతో పోల్చితే సీట్లు పెరిగినప్పటికీ ఆ పార్టీ తన ధోరణి మార్చుకోలేదు. పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అంతకుముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పుడు.. ఆ తర్వాత తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్నప్పుడు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ పాత పల్లవి అందుకుంది. ఒక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ , హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దగ్గరగా ఉంది. జమ్ము కాశ్మీర్ లోనూ సంయుక్తంగా అధికారాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే ఈ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి విమర్శలు చేయకపోవడం విశేషం. దీనిపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు. ” కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉంటే ఒకలాగా మాట్లాడుతారు. తమకు వ్యతిరేకంగా ఉంటే ఒకలాగా మాట్లాడతారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు. ప్రజాస్వామ్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారు. నియంత విధానాలకు పాల్పడిన వారు ప్రజల గురించి గొప్పగా ఎలా ఆలోచిస్తారంటూ” బిజెపి నాయకులు పేర్కొంటున్నారు.