Homeజాతీయ వార్తలుKarnataka CM: గెలిచి మూడు రోజులవుతోంది...ఇంతకీ సీఎం ఎవరు: పోటాపోటీగా డీకే, సిద్దూ వ్యూహాలు

Karnataka CM: గెలిచి మూడు రోజులవుతోంది…ఇంతకీ సీఎం ఎవరు: పోటాపోటీగా డీకే, సిద్దూ వ్యూహాలు

Karnataka CM: సుదీర్ఘకాలం తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. భారతీయ జనతా పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది.. 130 కి పైగా స్థానాల్లో విజయం సాధించి ఔరా అనిపించింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం ఉత్కంఠ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరికి వారు ముఖ్యమంత్రి పీఠం మీద ఆశలు పెంచుకున్నారు. పదవిని దక్కించుకునేందుకు ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మేమంతా ఒక్కటిగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. సాధించిన తర్వాత ఈ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సీఎం పీఠం దక్కించుకునేందుకు శనివారం సాయంత్రం నుంచి ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు.

ఏకవాక్య తీర్మానం

ఇక విజయం సాధించిన తర్వాత మొదటి సీఎల్పీ సమావేశం బెంగళూరులోని వసంత నగర్ లో విలాసవంతమైన హోటల్లో నిర్వహించారు. అయితే ఈ సమావేశం రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనిని పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు సిద్ధరామయ్య, శివకుమార్ లతో ప్రత్యేకంగా ఒక గదిలో పరిశీలకులు అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహించారు. వీరిద్దరితో పరిశీలకులు అరగంటకు పైగా చర్చలు నిర్వహించినా అవి ఒక కొలిక్కి రాలేదు. దీంతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాత్రికి రాత్రి ఢిల్లీ వెళ్ళిపోయారు. సోమవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి ఆయన ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై చర్చిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పరిశీలకులు ఇచ్చే నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది.

వ్యూహాత్మకంగా..

అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠంపై చాలా ఆశలు పెంచుకున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి దానిని అనుసరించుకుంటూనే ఆదివారం ఉదయం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు.. అంతేకాదు నొమవినకెరె లోని మఠానికి వెళ్లి పూజల్లో పాల్గొన్నారు. తర్వాత తుమకూరు సిద్ధగంగా మఠాన్ని సందర్శించారు. అంతేకాదు ఒక్కలిగ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా వ్యవహరించారు.. బెంగళూరులోని విజయనగర్ ఆది చించిన గిరి మఠంలోనూ శివకుమార్ కీలక సమావేశం నిర్వహించారు. స్పటికానందపురి మఠాధిపతి నంజ వధూత స్వామీజీ, రాష్ట్ర వక్కలి గల సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, కరవే అధ్యక్షుడు నారాయణ గౌడ తో పాటు ఒక్కలిగ సముదాయం నుంచి గెలుపొందిన 29 మంది ఎమ్మెల్యేలు శివకుమార్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. డీకే సీఎం కావాలని సీఎల్పీ భేటీలో స్పష్టంగా చెప్పే బాధ్యతను మాగాడి ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పగించారు. అంతేకాదు కర్ణాటక పరిషత్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న బికే హరిప్రసాద్ కూడా డీకే కు సీఎంగా అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పారు.

సిద్దు కూడా..

మరోవైపు సిద్ధరామయ్య ఎమ్మెల్యే బైరతి సురేష్ అపార్ట్మెంట్ లో రహస్య భేటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనకు అత్యంత ఆప్తులైన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ భేటీ కేజే జార్జ్ నివాసానికి మారింది. అయితే ఇక్కడ సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తులైన 40 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సిద్ద రామయ్య, డీకే ఎవరూ బెట్టు వీడకపోవడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాదని కేంద్ర పరిశీలకులు ఒక అంచనాకు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. భేటీలోనే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని సిద్ధరామయ్య పట్టుపట్టారు. అయితే అధిష్టానం నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకోవాలని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఫలితంగా పంచాయితీ ఢిల్లీకి చేరింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయించే వారే ముఖ్యమంత్రి కాబోతున్నారు.. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సిద్ధరామయ్య వైపు సానుకూలంగా ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సీఎల్పీ భేటీ జరిగిన హోటల్ వద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక సోమవారం ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే 18 వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. సీఎం ఎవరైనా.. సామాజిక న్యాయం చేసే దిశగా ఇద్దరూ లేక ముగ్గురు ఉప ముఖ్యమంత్రి నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version