
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్‌లోని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. సూరత్ సెషన్స్ కోర్టులో ఒకటి, రెండు రోజుల్లో ఓ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమైన న్యాయసలహాదారుల బృందం రివ్యూ పిటిషన్‌ను తయారు చేసిందని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడమేకాకుండా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయ, రాజకీయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది.
సూరత్ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో స్టే కోసం ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని బిజెపి నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే త్వరలో కర్ణాటక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసిందన్న వాదనలూ లేకపోలేదు. కోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత అక్కడ ఒకవేళ స్టే లభిస్తే కాంగ్రెస్ పార్టీకి ఊరట దక్కుతుంది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన అనంతరం చత్తీస్గడ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. అక్కడ భారతీయ జనతా పార్టీని రాహుల్ గాంధీ తనకు జరిగిన పరువు నష్టాన్ని జనాల్లోకి తీసుకెళ్లి, ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒకవైపు ఈ కసరత్తు జరుగుతుండగానే..కేరళ హైకోర్టు తీర్పు తర్వాత ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్‌పై అనర్హతను లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫైజల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు కాస్త ముందు ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై విపక్షాలు భగ్గుమంటున్న తరుణంలో ఫైజల్ విషయంలో లోక్‌సభ సచివాలయం దిగొచ్చి నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతుందనే భయంతోనే తనపై అనర్హతను ఎత్తివేశారని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని ఫైజల్ అన్నారు. లక్షద్వీ ప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైజల్ లోక్‌సభకు హాజరయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్ (దివంగత కేంద్ర మంత్రి పీఎం సయీద్ అల్లుడు)పై జరిగిన హత్యా యత్నం కేసులో ఈ ఏడాది జనవరి 10న ఫైజల్‌ను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ అదే నెల 25న ఆదేశాలు వెలువడ్డాయి. అయినా ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణకు ముందు ఆయనపై అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. సెషన్స్ కోర్టు ఆయనకు విధించిన జైలు శిక్షను కేరళ హైకోర్టు నిలిపివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఫైజల్ పిటిషన్‌ను పక్కనపెట్టింది. కేరళ హైకోర్టు తీర్పుతో లక్షద్వీప్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని, లోక్‌సభ సచివాలయం మాత్రం రెండు నెలలకు పైగా జాప్యం చేసిందని ఫైజల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.