
BJP Vs Congress: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రెండింటికీ జీవన్మరణ సమస్యగా తయారైంది. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో గెలవడం ఈ రెండు పార్టీలకూ కీలకమే. మరోవైపు జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్ర కొనసాగించే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తూ, ఎన్నికల అనంతర కూటమికి జేడీఎస్ ద్వారాలు తెరిచి ఉంచింది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోడానికి ముందు తన పునరుజ్జీవం కోసం కర్ణాటక ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏర్పడిన నైరాశ్యం నుంచి కేడర్‌లో ఉత్సాహం నింపి మరికొన్ని నెలల్లో జరుగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, రాజస్థాన్ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కూడా కాంగ్రె్‌సకు కర్ణాటకలో గెలుపు కీలకం. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కన్నడిగుడు ఖర్గే ఉన్న నేపథ్యంలో ఆయన సొంత రాష్ట్రంలో గెలుపు కాంగ్రెస్ కు ప్రెస్టేజీ అంశంగా మారింది.
ఏఐసీసీ అధ్యక్షుడి సొంత రాష్ట్రం
కర్ణాటక ఖర్గేకు సొంత రాష్ట్రం. ఆయన రూపంలో దళితుల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్(ఒక్కలిగ), మాజీ సీఎం సిద్ధరామయ్య(కురుబ)ల రూపంలో స్థానికంగా బలమైన నాయకత్వం ఉంది. వీటితోపాటు బీజేపీప్రభుత్వ 40ు కమీషన్ అవినీతిపై ప్రచారం చేయగలిగితే కాంగ్రె్‌సకు గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు తాజా రిజర్వేషన్ వివాదంతో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అయితే, డీకే శివకుమార్, సిద్దరామయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు, సీనియర్ నేతల అసంతృప్తి కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే ముప్పుంది.

పరీక్ష నెగ్గుతారా?
అధికార బీజేపీకి కర్ణాటకలో గెలుపు సవాలుగా మారింది. హిజాబ్ వివాదం, అవినీతి ఆరోపణలను అధిగమించి అధికారాన్ని నిలబెట్టుకుంటామని సీఎం బొమ్మై ఆశాభావంతో ఉన్నారు. ప్రధాని మోదీ పాపులారిటీకీ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పార్టీ విధానాలకు కూడా కర్ణాటక ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్న లింగాయత్, ఒక్కలిగల ఓట్లు గంపగుత్తగా తమకే పడేలా బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ముస్లింల 4ు రిజర్వేషన్‌ను రద్దు చేసి, ఈ రెండు కులాలకు చెరో రెండు శాతం పెంచింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికలకు తన ప్రచారాన్ని ఏప్రిల్ 5న కోలార్‌లో ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ప్రచారం సందర్భంగానే దొంగలందరికీ ఇంటిపేరు మోదీ ఎందుకు ఉందంటూ నీరవ్ మోదీ, లలిత్ మోదీ తదితరులను రాహుల్ ప్రస్తావించారు. ఆ కేసులోనే కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించగా, లోక్‌సభ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.