Homeజాతీయ వార్తలుప్రధాని పిలుపును ఎద్దేవా చేస్తున్న కాంగ్రెస్ నేతలు

ప్రధాని పిలుపును ఎద్దేవా చేస్తున్న కాంగ్రెస్ నేతలు


కరోనా చీకట్లు తొలగించేందుకు ఈనెల 5న ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా సమష్టిగా సంకల్పం చాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై దేశ వ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అసహనంగా వ్యవహరిస్తున్నారు.

గత నెల ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుకు, ఆ తర్వాత మూడు వరాల లాక్ డౌన్ కు, ఇప్పుడు దీపాలు వెలిగించడానికి భారత ప్రజల నుండి లభిస్తున్న అసాధారణమైన మద్దతు ప్రపంచ ప్రజలను ఆకట్టుకొంటూ ఉంటె కాంగ్రెస్ నేతలు మాత్రం ఎద్దేవా చేస్తున్నారు.

‘మేము దీపాలు వెలిగిస్తాం. మీరు ప్రజల ఆర్థిక భాదలు తీర్చండి’ అంటూ మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రియతమ నరేంద్ర మోదీజీ… మేము మీ మాట వింటాం. ఏప్రిల్ 5న లైట్లు, దీపాలు వెలిగిస్తాం. ఇందుకు బదులుగా మీరు దయచేసి మా మాటలు, సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన విజ్ఞాన వేత్తలు, ఆర్థికవేత్తలు ఇచ్చే తెలివైన సూచనలు, సలహాలు తీసుకోండి’ అని ఓ ట్వీట్‌లో సూచించారు.

మార్చి 25న నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఎఫ్ఏపీలో పూర్తిగా పేదలు, పేద వర్గాలను విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారనగానే పేదలు, పేద వర్గాల కోసం ‘ఆర్థిక సహాయ ప్యాకేజీ-2’ (ఎఫ్ఏపీ)ని ప్రకటిస్తారని అంతా ఆశించారని చెప్పారు.

‘ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రోజువారీ కూలీల నుంచి, వేతల జీవులు, వ్యాపారుల వరకూ తిరిగి కోలుకుని కొత్తజీవితం ప్రారంభించేందుకు వీలుగా మీ నుంచి ఏదో ఒక ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూశారు. చివరకు నిరాశకు గురయ్యారు’ అని చిదంబరం ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ పిలుపును తాను వ్యతిరేకిస్తున్నాని, దాన్ని పాటించనని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి స్పష్టం చేశారు. అసలు కరోనాపై పోరుకు, లైట్లు బంద్‌ చేసి క్యాండిళ్లు, టార్చ్‌లు వెలిగించడానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ట్వీట్‌ చేశారు.

‘నేను లైట్లు బంద్‌ చేయను, క్యాండిళ్లు వెలిగించను, కానీ కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. అలా చేస్తే తనపై జాతివ్యతిరేఖి అనే ముద్ర వేస్తారని, దానికి నేను సిద్ధంగా ఉన్నా’నని పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా దీనిపై పెదవి విరిచారు. ఇదొక ‘ఫీల్ గుడ్ మూమెంట్’ మాత్రమేనని చెప్పారు. ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు, ఆందోళనలపై ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటన చేయలేదని విమర్శించారు.

‘ప్రజల అగచాట్లు, వారిపై పడుతున్న భారం, ఆర్థిక ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్తు విజన్ ఏమిటో, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పరిస్థితులు మెరుగుపరచేందుకు ఏం చర్యలు తీసుకోనున్నారో ప్రస్తావించ లేదు’ అని శశిథరూర్ ట్వీట్‌ చేశారు.

మోదీని ప్రధాన షోమ్యాన్‌గా, ఫోటోలకే పరిమితమయ్యే ప్రధానిగా కూడా ఆ ట్వీట్‌లో శశిథరూర్ సంబోధించారు.

కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ రాజకీయ సన్నిహితుడు, ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కోసం ఆర్థిక సహాయం లేదా ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటన చేయలేదని ట్విటర్లో విమర్శించారు.

‘ఈ దేశం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కాదు. దేశ ప్రజలంతా మనుషులు.. వారికి కూడా ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. మా జీవితాలను 9 నిమిషాల జిమ్మిక్కులతో తగ్గించొద్దు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ సాయం చేస్తుందో చెప్పండి. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించి పేద ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అంటూ విమర్శలు కురిపించారు.

“రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం అందించాలని కోరితే మీరు (మోదీ) మాత్రం మీ ఇంట్లోని లైట్లను ఆర్పేయండని పిలుపునిస్తున్నారు. పేదలకు ఎలాంటి సహాయం అందిస్తారో చెప్పండి. అసంఘటిత రంగంలో లక్షలాది మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎదురుచూస్తున్నారు. వీటన్నింటిని విస్మరించి బదులుగా కొత్త డ్రామాతో మా ముందుకు వచ్చారని’ ఓవైసీ మండిపడ్డారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular