
కాంగ్రెస్ పార్టీ నేడు గోదావరి జలదీక్షకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా గోదావరిపై చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లనున్నారు. దీంతో అప్రమతమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులు జలదీక్షకు తరలివెళ్లకుండా ఉదయం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేపట్టారు. మరికొందరు ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళుతుండగా మార్గమధ్యలో అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జలదీక్ష షెడ్యూల్ ప్రకారంగా దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే సీతక్క, పోదెం వీరయ్య, ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద ఉత్తమ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దుమ్ముగూడెం వద్ద భట్టి, వీహెచ్, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్ పాల్గొనాల్సి ఉంది. అయితే వీరు ప్రాజెక్టులను సందర్శించడాని కంటే ముందుగానే పోలీసులు హౌజ్ అరెస్టులు చేస్తుండటంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టుల సందర్శన కోసం వెళ్తున్న తమను అడ్డుకోవద్దని డీజీపీకి ఉత్తమ్ లేఖ రాసినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ జలదీక్ష చేపడుతున్న తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలోని తొమ్మిది మండలాల తలుపునే గోదావరి ఉందని తెలిపారు. అయితే తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా లేవన్నారు. తమకు పక్కనే ఉన్న గోదావరి జలాలను తమకు కేటాయించకుండా ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక మీ ప్రాంతానికే ముఖ్యమంత్రా అంటూ వ్యాఖ్యానించారు. తమ ప్రాంతానికి గోదావరి నీళ్లిచ్చాకే ఇతర ప్రాంతాలను నీళ్లు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.