Congress Manifesto 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి బలమైన పోటీ ఇస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు తన మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించాలని భావిస్తున్న కాంగ్రెస్. 62 ప్రధాన అంశాలతో జంబో మేనిఫెస్టో రూపొందించింది. దీనికి అభయహస్తం అనే పేరు పెట్టింది. 42 పేజీలతో ఈ మేనిఫెస్టోని రూపొందించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోని గాంధీభవన్‌లో శుక్రవారం రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇందులో ఇదివరకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలతోపాటూ.. మరికొన్ని కీలక అంశాలను చేర్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేష్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లను మొదటి 16 పేజీలలో పేర్కొంది.
కీలక అంశాలు ఇవే..
ఈ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ అమర వీరుల సంక్షేమం, వ్యవసాయం – రైతు సంక్షేమం, నీటి పారుదల, యువత – ఉపాధి కల్పన, విద్యా రంగం, వైద్య రంగం, గృహ నిర్మాణం, భూ పరిపాలన, నిత్యవసరాల పంపిణీ, విద్యుత్ రంగం, పారిశ్రామిక రంగం, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, మద్యపాదన విధానం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, గల్ఫ్ కార్మికులు, కార్మికుల సంక్షేమం.. ఇలా చాలా అంశాలను పొందుపరిచింది.
జంబో ఎందుకంటే..?
కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో ప్రతీ అంశాన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వస్తోంది. మేనిఫెస్టో రూపకల్పనలో కూడా.. పైపై హామీలతో సరిపెట్ట కుండా కచ్చితమైన విధి, విధానాలతో రూపొందించింది. అందువల్లే ఏకంగా 42 పేజీల మేనిఫెస్టో తయారైంది. ఇందులో 62 అంశాలను విడివిడిగా వివరిస్తూ.. ఇవ్వడం వల్ల ఇది పెద్ద మేనిఫెస్టోగా మారింది.
ఉచిత విద్యుత్ కే మొదటి ప్రాధాన్యత..
ఇక కాంగ్రెస్ తన మేనిఫెస్టో లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, జాబ్ కేలండర్, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు కీలకమైనవిగా పేర్కొంది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని టిఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టాలని ఉద్దేశంతో ఉచిత విద్యుత్ అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా పేర్కొంది. ఈ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు.