KCR Comments On Cloud Burst: తెలంగాణలో పొలిటికల్ బరస్ట్ కొనసాగుతోంది. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలో గోదావరి పరీవాహ ప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వర్షాలు కురిసే సమయంలో కేవలం ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్షలు నిర్వహించిన కేసీఆర్ పొరుగున్న ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వేతో తేరుకున్నారు. వరద బాధితులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అప్పటికే విపక్షాలు విమర్శలు దాడి మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో విమర్శలకు చెక్ పెట్టేందుకు శనివారం వరంగల్ వచ్చారు. ఆదివారం గోదావరి పరీవాహ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారు.
ప్రకృతి కూడా అనుకూలించని వైనం..
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని చూసి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ సర్వేకు ప్లాన్ చేశారు. కానీ ప్రకృతి కూడా ఆయనకు సహకరించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం రోజంతా ఎండగా ఉండగా, సీఎం ఏరియల్ సర్వే చేయాలనుకున్న ఆదివారం ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. చాలా జిల్లాల్లో ముసురు వాన మొదలైంది. దీంతో ఏవియేషన్ అధికారులు హెలికాప్టర్ ఎగిరేందుకు వాతావరణం అనుకూలంగా లేదని సమాచారం ఇచ్చారు. దీంతో సీఎం రోడ్డు మార్గంలోనే ములుగు, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
Also Read: Pawan Kalyan- Jagan: పవన్ దూకుడు.. జగన్‌కు పొలిటికల్ సినిమా
క్లౌడ్‌బరస్ట్.. విదేశీ కుట్ర అంటూ..
ములుగు, భద్రాద్రి జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. భారీ వర్షాలు వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం అంటూనే దీని వెనుక విదేశాల కుట్ర ఉన్నట్లు అనుమానించారు. ఇందుకు ఉదాహరణగా గతంలో జమ్మూకశ్మీర్‌లో, ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదలను ఉదహరించారు. తాజాగా తెలంగాణపై విదేశాలు క్లౌడ్ బరస్ట్‌కు కుట్ర చేశాయని తెలిసిందన్నారు. గోదావరి పరీవాహ ప్రాంతంలో వరదలకు క్లౌడ బరస్ట్ కారణం అయి ఉంటుందని పేర్కొన్నారు. సీఎం స్థాయి వ్యక్తి భారీ వర్షాలు విదేశీ కుట్ర అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది.
విపక్షాలు ముప్పేటా దాడి…
భారీ వర్షాలు, వరదలపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం కేసీఆర్.. నష్టాన్ని కప్పిపుచ్చేందుకు, ప్రభుత్వ వైఫల్యం దాచిపెట్టేందుకు క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటూ వ్యాఖ్యానిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్, జనసమితి, వైఎస్సార్‌టీపీ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి వరదల గురించి ఇంత చీప్‌గా మాట్లాడడం బాధాకరమన్నారు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణతో తాను నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు ఇటీవలి వరదలకు మునిగిపోయిందని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని పేర్కొన్నారు. దీనిని పక్కదోవ పట్టించేందుకే కేసీఆర్ క్లౌడ బరస్ట్, విదేశీ కుట్ర అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని మండిపడ్డారు. వర్షాలు, వరదలపై ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడంతోనే గోదావరి ములుగు, భద్రాచలం, మంచిర్యాల, రామగుండం పట్టణాలతోపాటు అనేక పల్లెలను ముంచిందని, కాలేశ్వరం మునిగిపోయిందని ఆరోపించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా అభివర్ణించారు. వరద బాధితులకు ఏం చేస్తాం, ఎలా ఆదుకుంటామో చెప్పాల్సిన ముఖ్యమంత్రి క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటూ జోకర్‌లా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రం కేసీఆర్ మాటలను తాము సీరియస్‌గా తీసుకుంటామని విదేశీ కుట్రకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందకు ముఖ్యమంత్రి ఇలా చీప్ వ్యాఖ్యలు చేశారని ఖండించారు. మాజీ మంత్రి, హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అయితే సీఎం వ్యాఖ్యలను తెలివితక్కువ మాటలుగా అభివర్ణించారు. తెలివి ఉన్న వాడెవడూ వరదల గురించి ఇలా మాట్లాడరన్నారు. కేవలం కేంద్రాన్ని బదనాం చేయాడానికి మాత్రమే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారన్నారు.
క్లౌడ్ బరస్ట్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్..
కాగా, క్లౌడ్ బరస్ట్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఇటీవల బీజేపీలో చేరిన పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయలో క్లౌడ్ బరస్ట్‌పై పవరపాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. మీడియా ముఖంగా క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎక్కడ జగిరే అవకాశ ఉంటుంది, క్లౌడ్ సీడ్ అంటే ఏమిటి అని వివరించారు. కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఖండించారు. మొత్తంగా సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ బరస్ట్‌కు కారణమయ్యాయి.
Also Read:Kaleshwaram Project: లక్ష కోట్ల కాళేశ్వరం ఎందుకు మునిగినట్టు?