కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిచింది. దీంతో ఆ పార్టీలో ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ.. ఆ సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
Also Read: పోలీసులపై దాడి కాదంట.. మసాజ్ చేశారట..: విశాఖ పోలీసుల వివరణ
అప్పటినుంచి వంశీ.. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. టీవీ డిబేట్‌ల్లో కూడా సొంత పార్టీ నేతలపైనే వంశీ దూషణల పర్వానికి దిగారు. దీంతో ఆయన సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం జగన్‌ను వంశీ కలిశారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. వంశీ వైసీపీకి అనుకూలంగా ఉండటాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో వంశీపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ.. తమను ఇబ్బందులకు గురిచేశాడని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని తీసుకోవద్దని భీష్మించారు. కానీ.. సీఎం జగన్ మాత్రం వంశీతో భేటీ అయ్యారు. ఇలా సంఘర్షణ జరుగుతుండగా యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి ఆ వర్గాన్ని శాంతింపజేశారు. అయితే.. ఇప్పుడు మరో వర్గం వంశీకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.
Also Read: నల్లపిల్లి ఇంట్లో ఉంటే కోట్ల రూపాయలు.. నిజమేనా..?
ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ.. వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్గాలకు పొసగడం లేనట్టుగా పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. వంశీకి తెలియకుండానే దుట్టా అల్లుడు శివభరత్‌రెడ్డి.. గన్నవరం నియోజకవర్గంలో ఓ వర్గానికి ప్రోత్సాహం ఇస్తున్నారని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు ముదరడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దుట్టా వర్గం సమావేశమైంది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే టికెట్ తమకే ఇవ్వాలంటూ షరతు విధించినట్లు సమాచారం. వంశీకే మళ్లీ టికెట్ ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని తేల్చిచెబుతున్నారు. అయితే ఈ వార్తలను మాత్రం దుట్టా వర్గం ఖండించింది. కేవలం అభివృద్ధి పనుల కోసమే మంత్రి పెద్దిరెడ్డిని కలిసినట్లు దుట్టా వర్గం అంటోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గన్నవరం మండలంలో సొంత పార్టీలో ఘర్షణలు చోటుచేసుకోవడంపై అధిష్టానం కానీ.. జగన్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్