CM Stalin: తెలుగుదనం గొప్పతనం అనిర్వచనీయం. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ఔన్నత్యం మాత్రం తగ్గలేదు. అవసరాలకు, ఉద్యోగ, ఉపాధికి సుదూర ప్రాంతాలు వెళ్లిన వారు, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారూ తమ తెలుగు మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఇందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అతీతులు కారు.
ఆయన తండ్రి కరుణానిధి తెలుగు కుటుంబానికి చెందిన వారు. కానీ రాజకీయ కారణాలు, స్వరాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు కరుడుగట్టిన తమిళవాదులుగా మారారు. తమిళం తప్ప మరే భాషనీ సహించలేని స్థితిలోకి మారిపోయారు. అటువంటి కుటుంబంలో పుట్టిన స్టాలిన్ తెలుగు భాష వాసనను పసిగట్టారు. తెలుగు భాషలో రాసుకున్న ప్రసంగాన్ని తమిళంలో చెబుతూ.. తడబడుతున్న ఓ మహిళా ప్రజాప్రతినిధిని ‘ఏమ్మా తెలుగా’ అని అనడం ద్వారా తన మూలాలను గుర్తు చేసుకున్నారు. సున్నిత మనస్కుడిగా పేరుగాంచిన ప్రస్తుత ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్.. ప్రతిపక్ష నేతల సలహాలకు తగిన ప్రాముఖ్యతనివ్వడం, అన్ని వర్గాలకు సమప్రాధాన్యమివ్వడం తదితరాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Also Read: Conflicts in Telangana Congress: టీ కాంగ్రెస్ అక్కడ.. రాహుల్ సైతం మార్చలేడంతే?
ఏమ్మా.. తెలుగువారా?
ఈ నెల 24వ తేదీన కాంచీపురంజిల్లాలో జరిగిన సభలో తెలుగులో రాసుకొచ్చిన ప్రసంగాన్ని తమిళంలో చదివిన సర్పంచ్‌ను అభినందించడం అందరినీ ఆకర్షించింది. శ్రీపెరంబుదూర్ యూనియన్ సెంగాడు పంచాయతీలో జాతీయ పంచాయతీ దినోత్సవం జరిగింది. ఈ గ్రామ సభకు ముఖ్యమంత్రి స్టాలిన్, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి టీఎం అన్బరసన్, ఎంపీ టీఆర్ బాలు, ఎమ్మెల్యే సెల్వ పెరుందగై, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రవీణ్ నాయర్, కాంచీపురం కలెక్టర్ డాక్టర్ ఎం.ఆర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ స్వాగతం పలుకుతూ ఆ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు చెంచురాణి తమిళంలో ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో తడబాటును గమనించిన సీఎం స్టాలిన్, తన పక్కనున్న టీఆర్ బాలుతో ‘ఆమె తెలుగులో రాసుకొచ్చి తమిళంలో చెబుతోంది’ అని నవ్వుతూ చెప్పారు.
చెంచురాణి ప్రసంగం ఆపాక… ‘ఏమ్మా తెలుగా?’ అని అడిగారు. అందుకామె ‘అవును సర్. నేను తెలుగు. మీ కోసం తమిళం మాట్లాడాను సర్. తప్పయితే మన్నించండి’ అని వేడుకుంది. అందుకాయన ఆమె వైపు అభినందనపూర్వకంగా చూస్తూ.. ‘‘మన పంచాయతీ అధ్యక్షురాలు చక్కగా తమిళంలో మాట్లాడ్డం చూశాను. ఆమె తెలుగు. తెలుగులో రాసుకొచ్చి తమిళంలో చదువుతోంది. ఆమెను నేను అభినందిస్తున్నాను. మీరూ హర్షధ్వానాలతో ఆమెకు ప్రశంసలు తెలపాల్సిందే’’ అని చెప్పడంతో సభ చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
తమిళవాదం నుంచి..
డీఎంకే నేతలంటేనే ‘కరడుగట్టిన తమిళవాదులు.. తమిళం తప్ప మరే భాషనీ సహించనివారి’గా ముద్రగడించారు. ఆ పార్టీకి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తెలుగు కుటుంబానికి చెందినవారైనా వీరతమిళుడిగానే పేరుగాంచారు. దీనికి తోడు 2006లో డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నిర్బంధ తమిళం’ జీవోతో ఆ పార్టీ ‘కరడుగట్టిన’ నామాన్ని సార్థకం చేసుకుంది. అయితే తరం మారే కొద్దీ, కాలం సాగే కొద్దీ ఆ పార్టీలోనూ కొంత మార్పు వస్తున్నట్లుంది. స్టాలిన్ రూపంలో కొత్త పుంతలను తొక్కుతోంది. అప్పటి వరకూ తమిళ రాజకీయాలంటే ఏవగించుకునే అపవాదు ఉండేది. అటువంటిది స్టాలిన్ గద్దెనెక్కాక ఆ అపవాదును సమూలంగా మార్చారు. ఒకప్పటి ప్రతీకార రాజకీయాలకు పూర్తి చెక్ చెప్పారు. తమిళవాద నిర్బంధం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు. తమిళంను ఆరాధిస్తూనే ఇతర భాషలపై అభిమానాన్ని పంచుతున్నారు. తమ కుటుంబ మూలమైన తెలుగుపై అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.
Also Read:Jagan Govts Borrowings: అప్పుల కోసం తిప్పలు.. కేంద్రం అనుమతి కోసం జగన్ సర్కారు పడిగాపులు