Homeఆంధ్రప్రదేశ్‌Jagan To Meet Party Workers: వైసీపీలో జగన్ కు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా?

Jagan To Meet Party Workers: వైసీపీలో జగన్ కు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా?

Jagan To Meet Party Workers: ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే ముఖ్యం. పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న వారిదే క్రయాశీలక పాత్ర. ఓటరును పోలింగ్ బూతుకు తెప్పించేది వారే. వారు అంకిత భావంతో పనిచేస్తేనే పార్టీ విజయం సాధిస్తుంది. అందుకే ప్రతీ పార్టీ కార్యకర్తలే కీలకమంటూ చెబుతుంటారు. వారిని అక్కున చేర్చుకుంటారు. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ 50 కుటుంబాల బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. పార్టీ శ్రేణులనే వలంటీర్లుగా, అధికారికంగా నియమించారు. రూ.5 వేలు చొప్పున వేతనంగా కూడా అందిస్తున్నారు. కానీ వలంటీర్ల నియామకంతో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వారికి మాత్రం పక్కనపడేశారన్న అపవాదు ఉంది. అటు అందరితో పాటు నవరత్నాలు అందుకుంటున్నారే తప్ప వారికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలు అంటూ ఏవీ లేవు. పోనీ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ కాంట్రాక్ట్ బాధ్యతలు తీసుకుని నాలుగు రాళ్లు వెనుకేసుకుంటామన్నా కుదరడం లేదు. బిల్లుల చెల్లింపులు లేవు. అటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు లేవు.. చేయడానికి విధులు లేవు. ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆగస్టు 4 నుంచి ప్రతీ నియోజకవర్గం నుంచి క్రియాశీలక నేతలు 50 మందితో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇది శుభ పరిణామమే అయినా… ఇప్పటికే మూడేళ్ల వ్యవధి దాటిపోయిందని.. ఎన్నికలకు పట్టుమని రెండేళ్లయినా లేదని.. ఈ సమయంలో క్రియాశీలక నాయకులతో సమావేశమైనా ఫలితముండదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Jagan To Meet Party Workers
Jagan

చుట్టూ కోటరీ…
గత మూడేళ్లుగా ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే రుచించడం లేదు. ఆయనను కలవాలంటే కోటరీని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి. అంత తేలిగ్గా సీఎం అపాయింట్ మెంట్ దొరకదు. మూడు ప్రాంతాలకు ముగ్గురు కోఆర్డినేటర్లు, సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన కీలక నాయకులను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవాల్సిందే. అసలు సీఎం దర్శనం కోసం ఎమ్మెల్యే స్థాయి నాయకులే ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. పార్టీ స్థితిగతులు చర్చించడానికి కూడా యాక్సిస్ ఉండదన్న అపవాదు ఉంది. సీఎం చుట్టూ ఒక కోటరీ ఉంటుందని.. అంతా అదే చూసుకుంటుందని వైసీపీ వర్గాల్లో అయితే ఒక టాక్ ఉంది. అయితే ఇప్పుడు పార్టీకి గడ్డుకాలం ఎదురుకావడంతో సీఎం జగన్ క్షేత్రస్థాయి నాయకులు గుర్తుకొచ్చారు. అందుకే వారితో మమేకమై పార్టీ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వారితో చర్చించనున్నారు. అయితే ఐదు నిమిషాలు కలవడానికే సీఎం జగన్ ఇష్టపడరని.. అటువంటిది 175 నియోజకవర్గాలతో సమావేశాలు అయ్యే పనియేనా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. అందునా 50 మందితో మాట్లాడగలరా అన్న ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఒక వేళ ఒకరిద్దరి అభిప్రాయాలు సేకరించి భోజనం పెట్టి పంపించాలనుకుంటే మాత్రం వృథా ప్రయాసే.

Also Read: KTR Birthday Song 2022: కేటీఆర్ బర్త్ డే వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ 

ఓటమి భయంతోనే..
వాస్తవానికి సీఎం జగన్ ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో గట్టెక్కగలమా ? లేదా? అన్న భయం వెంటాడుతుండడంతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. అటు వ్యూహకర్తలు, ఇటు పార్టీ శ్రేణుల సాయంతో 2024 ఎన్నికలను గట్టెక్కాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ స్థాయిలో సమీక్షలకు సిద్ధపడుతున్నారు. వాస్తవానికి క్రియాశీలక నాయకులకు ఉన్నంత పట్టు ఎమ్మెల్యేలకు కూడా ఉండదు. క్షేత్రస్థాయిలో లోటుపాట్లు వారికి తెలుస్తాయి ప్రజల నాడిని ఇట్టే పట్టుకోగలరు. తాము ఎక్కడ ఫెయిలయ్యామో… దానిని ఎలా సరిదిద్దుకోవాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అయితే ఈ విషయం జగన్ ఆలస్యంగా తెలుసుకున్నారు. స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా పదవులిచ్చాము.. వివిధ కార్పొరేషన్లలో నియామకాలు చేపట్టాం.. అని ధీమాలో ఉండిపోయినట్టున్నారు. అటు సర్వేలో క్రియాశీలక నాయకులు మౌనంగా ఉంటున్నారని తెలియడంతో అప్రమత్తమవుతున్నారు. గడపగపడకూ మన ప్రభుత్వ కార్యక్రమం ఫెయిలవ్వడానికి కూడా క్రియాశీలక నాయకులు దూరంగా ఉండడమే కారణమని గుర్తించారు. అందుకే జగన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

Jagan To Meet Party Workers
Jagan

ఎమ్మెల్యేల్లో కలవరం..
అయితే ఈ పరిణామం ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటోంది. అసమ్మతి రాజకీయాలు పెరిగే అవకాశముందని వారు భయపడుతున్నారు. ఇన్నాళ్లూ స్థానికంగానే కొనసాగుతున్న విభేదాలు సీఎం దృష్టికి వెళితే తమకు నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థలో పదవులు దక్కని వారు తమ గోడును వెళ్లబోసుకున్నా జిల్లా నాయకత్వాలు పట్టించుకోలేదు. ఆ విధంగా ఎమ్మెల్యేలు మేనేజ్ చేసుకున్నారు. అటువంటి వారు సీఎం సమీక్షలకు హాజరైతే మాత్రం తమ మీద తప్పకుండా ఆరోపణలు చేస్తారని భావిస్తున్నారు. అధినేతకు ఫిర్యాదులు చేస్తారని.. తమపై లేనిపోనివి చెప్పి నష్టం చేస్తారని లోలోన మదనపడుతున్నారు. అందుకే తమకు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులను ముందుగానే గుర్తించి జాబితా నుంచి తప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Also Read:Telangana Rains: జనానికి నరకయతనే.. తెలంగాణలో మళ్లీ వానలు.. మరో ఐదు రోజులు.. రెడ్ అలెర్ట్

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular