జల వివాదంపై కేసీఆర్ అభ్యంతరం జగన్ బేతఖార్

కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఖాతరు చేయబోమని సంకేతాన్ని ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. పైగా `మానవత్వం’ తో ఈ అంశం చూడాలని అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. తాము అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ చేస్తున్న వాదనలను తిప్పికొట్టారు. కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని, దీనిపై రాజకీయం చేయడం సరికాదని అంటూ […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 10:24 am
Follow us on

కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఖాతరు చేయబోమని సంకేతాన్ని ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. పైగా `మానవత్వం’ తో ఈ అంశం చూడాలని అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.

తాము అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ చేస్తున్న వాదనలను తిప్పికొట్టారు. కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని, దీనిపై రాజకీయం చేయడం సరికాదని అంటూ కేసీఆర్ కు హితవు చెప్పారు.

రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లులేని దుస్థితి ఉందని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని జగన్ ఈ సందర్భంగా కేసీఆర్ ను కోరారు. ,మరో వంక వైసిపి నాయకులు గతంలో జగన్ కలసినప్పుడు రాయలసీమకు పెద్ద మనసుతో నీళ్లివ్వడానికి అభ్యంతరం ఉండబోదని చెప్పిన మాటలను సోషల్ మీడియాలో, టివి ఛానల్స్ లో ఇప్పుడు రికార్డు ప్లే చేస్తున్నారు.

రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేస్తూ కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం లేద‌‌న్నారు. పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి కృష్ణా బోర్డు కూడా అంగీకరించద‌‌ని అంటూ తెలంగాణతో వాదనకు సై అంటున్నారు.

‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి చాన్స్ ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు మించి ఉండదు. ఆ 10 రోజుల్లోనే నీటిని తీసుకెళ్లాలి. శ్రీశైలంలో వాటర్ లెవెల్ 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే వెయ్యి క్యూసెక్కులు మాత్రమే వెళ్తుంది’ అంటూ జగన్ స్పష్టం చేస్తున్నారు.

కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్‌‌ నుంచి వెళ్లేది గరిష్టంగా 9 వేల క్యూసెక్కులు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే సాధ్యం అని జగన్ గుర్తు చేస్తున్నారు.

అదే తెలంగాణకు శ్రీశైలం నుండి 200 టిఎంసి నీరు తీసుకొనే సామర్ధ్యం ఉన్నదని అంటూ జగన్ ఎదురు దాడికి దిగుతున్నారు. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా శ్రీశైలంలో 800 అడుగులు ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీల మేర 90 టీఎంసీలు తరలించవచ్చని చెప్పారు.

కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారన్నారు. 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి 30 టీఎంసీలు, ఎస్‌‌ఎల్‌‌బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు కూడా 40 టీఎంసీలు తరలించవచ్చని అంటూ వివరాలతో సహా వాదనకు సిద్ధమవుతున్నారు.