KCR – Dalitha bandhu : కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో.. ‘ద‌ళిత బంధు’ తేలిపోయిందా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై ఎన్నో విమ‌ర్శ‌లు.. మ‌రెన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీ కుటుంబానికి ప‌ది ల‌క్ష‌ల మేర ల‌బ్ధి చేకూరుస్తామని ప్ర‌భుత్వం చెబుతుండ‌గా.. అది అసాధ్య‌మ‌ని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ల‌బ్ధి పొందేందుకు ఆడుతున్న నాట‌క‌మ‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్నిక ముగియ‌గానే ప‌థ‌కం అట‌కెక్కుతుంద‌ని, ఓట్లు కొనేందుకే ఈ ప‌థ‌కం తెచ్చార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే.. తొలుత నియోజ‌క‌వ‌ర్గానికి వంద మంది చొప్పున అమ‌లు చేస్తామ‌ని […]

Written By: Bhaskar, Updated On : August 16, 2021 2:23 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై ఎన్నో విమ‌ర్శ‌లు.. మ‌రెన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీ కుటుంబానికి ప‌ది ల‌క్ష‌ల మేర ల‌బ్ధి చేకూరుస్తామని ప్ర‌భుత్వం చెబుతుండ‌గా.. అది అసాధ్య‌మ‌ని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ల‌బ్ధి పొందేందుకు ఆడుతున్న నాట‌క‌మ‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్నిక ముగియ‌గానే ప‌థ‌కం అట‌కెక్కుతుంద‌ని, ఓట్లు కొనేందుకే ఈ ప‌థ‌కం తెచ్చార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు.

అయితే.. తొలుత నియోజ‌క‌వ‌ర్గానికి వంద మంది చొప్పున అమ‌లు చేస్తామ‌ని చెప్ప‌డంతో.. విమ‌ర్శ‌లు మ‌రింత ముదిరిపోయాయి. దీంతో.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. ద‌ళిత సంఘాలు, విప‌క్షాలు.. రాష్ట్రం మొత్తం అమ‌లు చేయాల‌ని, హుజూరాబాద్ ఎన్నిక ముందే ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ వెళ్లిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్‌.. ముఖ్య‌మంత్రి హుజూరాబాద్‌ స‌భ‌లో 15 మంది ల‌బ్ధిదారుల‌కు మాత్ర‌మే చెక్కులు పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. దీంతో.. మిగిలిన వారిలో ఆందోళ‌న మొద‌లైంది.

త‌మ వ‌ర‌కూ ప‌థ‌కం వ‌స్తుందో రాదోన‌న్న ఆందోళ‌న హుజూరాబాద్ ల‌బ్ధిదారుల్లో వ్య‌క్త‌మైంది. అయితే.. తాజాగా కేసీఆర్ మ‌రో బాంబు పేల్చారు. స్వాతంత్ర దినోత్స‌వ వేళ ప్ర‌సంగించిన ముఖ్య‌మంత్రి.. హుజూరాబాద్ లో ద‌ళిత బంధును మొత్తం అమ‌లు చేస్తామ‌ని, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పాక్షికంగా అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. దీంతో.. ఇప్పుడు అంద‌రి నోళ్ల‌లో ఇదే నానుతోంది. ‘పాక్షికంగా’ అంటే ఏందీ? దీని అర్థమేంటీ? అనే చ‌ర్చ రాష్ట్ర‌వ్యాప్తంగా సాగుతోంది.

అంటే.. నియోజ‌క‌వ‌ర్గానికి వంద మంది చొప్పున‌ ఇస్తారా? లేదంటే.. ప‌దిహేను మందితో స‌రిపెడ‌తారా? అన్న‌ది తెలియ‌కుండా ఉంది. పాక్షికం అన్న‌పేరుతో ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి మాదిరిగానే అట‌కెక్కిస్తారా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. విప‌క్షాలు ఈ అంశాన్ని గ‌ట్టిగా ప‌ట్టుకున్నాయి. తాము మొద‌ట్నుంచి చెబుతున్న‌ది ఇదేన‌ని.. ఇప్పుడు ముఖ్య‌మంత్రే ప‌రోక్షంగా అంగీక‌రించార‌ని అంటున్నారు. పాక్షికం పేరుతో హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్త‌యిన త‌ర్వాత ప‌థ‌కాన్ని పూర్తిగా ప‌క్క‌నేస్తార‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.