అది బ్రిటీష్ హయాం.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేందుకు జిల్లాలకు ఒక కలెక్టర్ ను బ్రిటీష్ పాలకులు నియమించారు. ‘కలెక్ట్’ అంటే వసూలు.. అనే అర్థంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే అధికారిగా బ్రిటీష్ వారు ఈ పేరు పెట్టారు. కానీ స్వాతంత్ర్యం అనంతరం మన దేశ పాలకులు కూడా జిల్లాను ఏలే ఐఏఎస్ అధికారులకు ‘కలెక్టర్’ అనే పేరును కొనసాగించారు. కానీ కలెక్టర్ ఇప్పుడు పన్నులు వసూలు చేసే బాధ్యతల్లో లేరు. జిల్లా పరిపాలన అధికారిగా.. మేజిస్ట్రేట్ గా ఉన్నారు. ఆ పాతపేరు ఐఏఎస్ లకు అపవాదు అని తెలంగాణ సీఎం కేసీఆర్ భావించి ‘కలెక్టర్’ అన్న పేరుకు మంగళం పాడేస్తున్నారని తెలిసింది.
Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించారు. అధికారుల హోదాలో కూడా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ పేరు ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ గా మార్చాలని.. కలెక్టర్ అనే పదాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సచివాలయంలో వేగంగా దస్త్రం రెడీ అవుతోందని తెలిసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టి రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అవినీతికి నిలయమైన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలనే ఎత్తివేయాలని నిర్ణయించారు. వారిని వేరే శాఖల్లో విలీనం చేస్తారు. ఈ క్రమంలోనే మొత్తం రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?
ఇక నుంచి రిజిస్ట్రేషన్ శాఖ చేసే పనులన్నీ తహసీల్దార్లకే అప్పగిస్తారు. కీలకమైన భూ, పరిపాలన వ్యవస్థలు, ప్రజలకు అవరసరమైన సర్టిఫికెట్లు.. ఇతర పనుల పర్యవేక్షణ తహసీల్దార్లకే అప్పగించనున్నారు. ఇక తప్పు జరిగితే తహసీల్దార్ల పోస్టులు కూడా ఊస్ట్ అయ్యేలా రెవెన్యూ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరచబోతున్నట్టు తెలుస్తోంది.
-ఎన్నం