CM Jagan: ఏపీ సీఎం జగన్ తేల్చేశారు. పనిచేసే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు అని తేల్చి చెప్పేశారు. గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు మాదిరిగానే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలను మారుస్తారని తాజాగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వేల నివేదికలు చివరాఖరికి వచ్చాయని.. ప్రజల్లో ఉండే వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని జగన్ కుండబద్దలు కొట్టేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. తమకు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్న అంతర్మధనం ప్రారంభమైంది.ప్రతి జిల్లాలో ముగ్గురు నుంచి నలుగురిని మార్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ ప్రారంభమైంది.
చాలామంది సిట్టింగ్ ల పని తీరు బాగాలేదు. పార్టీ చేపట్టిన సర్వేలతో పాటు నిఘా వర్గాల నుంచి కూడా అదే సమాచారం వచ్చింది. మరోవైపు ఐప్యాక్ టీం సైతం ఎమ్మెల్యేలను వెంటాడింది. వారిపై స్పష్టమైన నివేదికలు ఇచ్చింది. దీంతో జగన్ ఈ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చాలాసార్లు వర్క్ షాపులు నిర్వహించి మరి జగన్ హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రధానంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాలని.. ప్రజల మధ్య ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురు కావడంతో చాలామంది ఈ కార్యక్రమానికి ముఖం చాటేశారు. ఈ జాబితాలో కొందరు సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా ప్రకటనతో ఇటువంటి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ కీలక విషయాలపై స్పష్టతనిచ్చారు. రాజకీయ వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. అటు తరువాత పనిచేయని వారికి టికెట్లు ఇవ్వమని జగన్ తేల్చేశారు. దీంతో ఎవరెవరికి టికెట్లు రావు అన్న చర్చ ప్రారంభమైంది. టికెట్లు రానివారు ఎలా వ్యవహరిస్తారు అన్న టాక్ కూడా నడుస్తోంది. అయితే ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండడంతో జగన్ స్పష్టమైన హింట్ ఇవ్వడం విశేషం. గతంలో టిక్కెట్లు ఇవ్వమని తేల్చేయడంతోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి ఎదురు తిరిగారు. ఇప్పుడు అదే పరిస్థితి పార్టీలో వస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అయితే ఈపాటికే ఎవరెవరికి టికెట్లు రావు అన్నది స్పష్టత వచ్చింది. నియోజకవర్గాల్లో విభేదాలు పరిష్కరించుకోవాలని సైతం ఎమ్మెల్యేలకు జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పనితీరు బాగున్నా.. నియోజకవర్గాల్లో విభేదాలను సాకుగా చూపి ఎక్కడ తప్పిస్తారోనన్న ఆందోళన చాలామందిలో ఉంది. అయితే టిక్కెట్లు రానివారి సేవలను మరోలా వినియోగించుకుంటామని.. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని జగన్ చెప్పుకు రావడం ఉపశమనం కలిగించే విషయం. అయితే ఇప్పుడున్న సిట్టింగ్ స్థానాలను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. జిల్లాలో మెజారిటీ సిట్టింగులను కొనసాగించి.. కొద్దిమందిని తప్పిస్తే మాత్రం వారు ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే టిక్కెట్లు మారుస్తానని చెప్పిన జగన్.. గతం మాదిరిగా జాబితాను బయట పెట్టలేదు. ఫలానా వారు అంటూ చెప్పలేదు. కనీసం వెనుకబడిన వారి సంఖ్య ఇది అంటూ ప్రకటించలేదు. మరో ఆరు నెలల పాటు ప్రజలతో మమేకం అయిన వారికే ఛాన్స్ ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం తాజా ప్రకటనతో ఎమ్మెల్యేల్లో హై ఫీవర్ నెలకొంది.