ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్నికల కమిషనర్ నియామక వివాదం, గ్రామసచివాలయాల అంశమూ చర్చకు దారి తీస్తున్నాయి. ప్రతిపక్షం, ప్రభుత్వంతో విభేదించే వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిర్ణయాల అమలులో జాప్యం ఏర్పడుతోంది. రాజకీయ లక్ష్యాల కోసం ప్రతిపక్షాలు దేనికైనా అడ్డు తగులుతుంటాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలే నెగ్గాయి. వైసీపీ సర్కారు మాత్రం ఎదురీదుతోంది. ముఖ్యమంత్రి అభీష్టంగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో జరిగిన పొరపాట్లపై ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజ్యాంగ పరమైన విషయాల్లో ఆచితూచి అడుగేసినా చిక్కులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక కేసులు హైకోర్టు పరిధి దాటి సుప్రీంకోర్టుకు చేరుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కేసులు నమోదవుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మెజార్టీ కేసుల్లో ప్రభుత్వ వాదన వీగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా స్థాయిలు ఉంటాయి. ఒక్కో దశలో పర్యవేక్షణ తరువాతే మిగతా దశలు ఉంటాయి. దీంతో ఏ పని అయినా దానిపై పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర పడిన తరువాతే అమల్లోకి వస్తాయి. దీంతో ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి వీలుండదు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమలులో పర్యవసానాలు మాత్రం ముఖ్యమంత్రి పైనే ప్రభావం చూపుతాయి.
వైసీపీ సర్కారుకు మంచి యంత్రాంగమే ఉంది. అయితే అధికారులు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలని చూస్తున్నారు. సీఎం చెప్పిందే వేదంగా భావించి తమ పనులు కానిస్తున్నారు. దీంతో చివరికి ఫలితం సీఎంపైనే పడుతోంది. ఈ పరిస్థితుల్లో తప్పులు దొర్లితే దానికి బాధ్యత ఆయనే వహించాల్సి వస్తోంది. సర్కారు పొరపాట్లు సరిద్దుకుంటే ప్రభుత్వ నిర్ణయాల్లో ఆటంకాలు తొలగుతాయని పలువురు విశ్లేషకుల అభిప్రాయం.