
‘ఫ్యాన్స్ నందు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరయా’ అన్నాడు దర్శకుడు క్రిష్. ‘పవన్ కల్యాణ్ కు అభిమానులు ఉండరు.. భక్తులే ఉంటారు’ అన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. వకీల్ సాబ్ విడుదల సందర్భంగా వారు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో.. సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఫ్యాన్స్ లో ఆనందం, ఉత్కంఠ తారస్థాయికి చేరుతోంది.
సహజంగా పవన్ కల్యాణ్ సినిమాలకు రెగ్యులర్ గానే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ.. వకీల్ సాబ్ మూడు సంవత్సరాల తర్వాత వస్తుండడంతో వారి హంగామాకు అడ్డే లేకుండాపోయింది. పవన్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్ర ట్రైలర్ సృష్టించిన నెవ్వర్ బిఫోర్ రికార్డులే ఇందుకు సాక్ష్యం. కేవలం 24 గంటల్లోనే 18 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి.. తెలుగు ఇండస్ట్రీల్లోనే నెంబర్ వన్ టీజర్ గా నిలిచింది. ఇందులో పవన్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకుల షేర్ కూడా ఉందన్నది విస్మరించలేని అంశం. దీంతో.. అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి ఉందని తేలిపోయింది.
ట్రైలర్ రికార్డు మాత్రమే కాదు.. బాక్సాఫీస్ బుకింగ్స్ విషయంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించిందీ సినిమా. ఇప్పటి వరకూ ఏ సినిమాకూ లేనివిధంగా ఫస్ట్ డే టిక్కెట్లు బుకింగ్ అయిపోయాయి. హైదరాబాద్, విశాఖ, ఒంగోలు, కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లోని 96 శాతానికిపైగా థియేటర్లన్నీ వకీల్ సాబ్ ప్రభంజనంలో మునిగిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఒకటీ అరా థియేటర్లు మినహా.. అన్నింటిలోనూ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. హైదరాబాద్ లోని మల్టీ ఫ్లెక్సులన్నింటా ఇదే సినిమా ఆడబోతోంది. మొత్తం 400 ఆటలు ప్రదర్శించనున్నట్టు సమాచారం. విశాఖలో 65, ఒంగోలులో 25, గుంటూరులో 51, కడపలో 24.. ఇలా భారీ స్థాయిలో వకీల్ సాబ్ ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, బి, సి, సెంటర్లన్నీ వకీల్ సాబ్ తోనే నిండిపోతున్నాయి.
ఇప్పటి వరకూ ఏ చిత్రానికీ ఇలాంటి జోరు నమోదు కాలేదని చెబుతున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత వస్తున్న మొదటి పెద్ద సినిమా కావడంతో.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే ఇంత రచ్చ చేస్తున్న వకీల్ సాబ్.. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.