CM Jagan Mohan Reddy: అత్త తిట్టినందుకు కాదు బాధ తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిస్థితి. ఏపీలో జరుగుతున్న మహిళలపై ఆకృత్యాలు ప్రభుత్వం తీరుతోనే అని వ్యాఖ్యలు చేస్తున్న మీడియాపై విరుచుకుపడుతోంది. ముఖ్యమంత్రి జగన్ అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మరోసారి మీడియాపై తన కోపాన్ని ప్రదర్శించారు. పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న ప్రసారాలపై తనలోని అక్కసు వెళ్లగక్కుతున్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల గురించి మీడియా చెప్పడమే తప్పన్నట్లుగా సీఎం జగన్ మాట్లాడుతున్నారు.
గుంటూరులో రమ్య హత్య కేసులో మీడియా ప్రాధాన్యం ఇవ్వకపోతే ఇంత ప్రాధాన్యం ఉండేది కాదు. వారికి న్యాయం జరిగేది కాదు. ఢిల్లీ నుంచి ఎస్సీ కమిషన్ వచ్చి రమ్య కుటుంబాన్ని ఆదుకునేదా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న దారుణాల గురించి మీడియా ద్వారానే ఎక్కువగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై మచ్చ పడుతోంది. సీఎం జగన్ వీటిపై దృష్టి సారించి మీడియా పాత్రపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ర్టంలో మహిళలపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో మీడియా పట్టించుకుని వాటిని ప్రసారం చేసేందుకు ఆసక్తి చూపించడంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని చెబుతున్నారు. మీడియా వల్లే లైంగికదాడుల విషయాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి కూడా నిరసన పెరుగుతోంది. ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం వల్లే ఇలా అత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏ మేరకు చర్యలు చేపడుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక సొంత మీడియా అయిన సాక్షిలో వస్తున్న కథనాలపై కూడా ప్రజల్లో ఆక్షేపణ వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయించుకోవడంతో నిజానిజాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మీడియా తటస్థంగా ఉండాల్సి ఉన్నా ఎందుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోందో అని నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ వల్లే ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.