CM Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష టీడీపీ, వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అంటున్న జనసేన ఎన్నికల రణానికి సమాయత్తం అవుతున్నాయి. ముందస్తు ఎన్నికలూ రావొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో తొలిసారే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. దాదాపు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనో, అభివృద్ధి కార్యక్రమాలనో లేక మూడు రాజధానులనో వచ్చే ఎన్నికల్లో అజెండాగా మార్చుకుంటారని అంతా భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వీటన్నింటి కంటే ముఖ్యమైన మరో అంశం ఎన్నికల్లో తనకు సునాయాసంగా విజయం తెచ్చిపెడుతుందన్న అంచనాల్లో ఉన్నారు. అదే ఇప్పుడు విపక్షాల్లోనూ గుబులు రేపుతోంది.

జగన్ వ్యూహాలు అవే..
ప్రస్తుతం ఏపీలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సారధిగా ఉన్న వైఎస్.జగన్ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రకరకాల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గతంలో చేసిన పొరబాట్లను సరిదిద్దుకుంటూ, ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కొత్త వ్యూహాలు తెరపైకి తెస్తున్నారు. అయితే ఇదంతా ఓ ఎత్తు మాత్రమే. వీటిన్నింటికీ మించి జగన్ ధీమా మరొకటి కనిపిస్తోంది.
గెలుపుపై ఇప్పటికే ఓ అంచనా..
ఏపీలో వచ్చే ఎన్నికలు ఎలా జరగబోతున్నాయన్న దానిపై వైఎస్ జగన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఏయే అంశాలు కీలక పాత్ర పోషించబోతున్నాయనే దానిపై జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల దగ్గరి నుంచి పథకాలు, రాజధానులు.. ఇలా ఏ అంశం చూసినా జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఏం జరగబోతోందో స్పష్టంగా ఊహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల విషయంలో పెద్దగా వ్యూహాలు అవసరం లేదనే భావన కూడా ఆయనలో కనిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా పథకాలు, అభివృద్ధి, రాజధానులను మించి మరో కీలక అంశం ఈసారి కూడా తనను కచ్చితంగా గెలిపిస్తుందనే ధీమా జగన్‌లో కనిపిస్తోంది.
చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు..
2019 ఎన్నికల్లో టీడీపీపై ఘన విజయంతో వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అంశాల్లో అత్యంత కీలకమైనది జగన్‌పై విశ్వసనీయత. జగన్ మాటిస్తే కచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం. అదే నమ్మకం, విశ్వాసం చంద్రబాబుపై జనం కోల్పోవడంతోనే 2019 ఎన్నికల్లో వైసీపీకి ఇంత భారీ విజయం కట్టబెట్టారనేది జగన్ నమ్మకం. ఇప్పటికీ అదే భావనలో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబును జనం నమ్మరనేది జగన్ విశ్వాసంగా కనిపిస్తోంది. ‘చంద్రబాబును జనం నమ్మితేనే కదా ఓట్లేసేది, ఆ నమ్మకాన్ని చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారు.. ఇప్పుడు కొత్తగా నమ్మకం కల్పించడానికి చంద్రబాబుకు అవకాశమే లేదు’ అనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు చూసినా తనపై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం అవుతున్న చంద్రబాబు… తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోతున్నట్లు జగన్ అండ్ కో గ్రహిస్తోంది.

పవన్‌పై అంచనాలివే..
అలాగే ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్నట్లు కనిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ జగన్ చాలా స్పష్టంగా ఉన్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా చంద్రబాబుతో ఆయన బంధంపై జనం ఓ క్లారిటీతో ఉన్నట్లు జగన్∙అంచనా వేస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే ఆ ప్రభావం తనపైనా పడుతుందని, విడిగా పోటీ చేస్తే కనీస సీట్లకు పరిమితం అవుతారని వైసీపీ అధినేత భావిస్తున్నారు. దీంతో వీరిద్దరి పొత్తుపైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తనను కలిసిన నేతలతో జగన్ చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌కు బీజేపీ అండ ఉన్నా ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉండబోదని జగన్ ధీమాతో ఉన్నారు. దీంతో ఏ విధంగా చూసినా పవన్ ప్రభావం అంతంతమాత్రమే తప్ప తనను గద్దెదించే స్థాయిలో ఉంటుందని జగన్ అనుకోవడం లేదని తెలుస్తోంది.