BRS Income: ఒక ఉద్యోగి ఆదాయం పెరగాలంటే.. పనితీరు మెరుగవ్వాలి… బిజినెస్‌లో లాభాలు పెరగాలంటే.. కొనుగోలుదారులు, వినియోగదారుల విశ్వసనీయత పొందాలి.. కానీ, రాజకీయ పార్టీల ఆదాయం పెరగడానికి ఇవేమీ అవసరం లేదు. అధికారంలో ఉంటే సరిపోతుంది. ఆదాయం దానికదే ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇదే సూత్రం ఇప్పుడీ బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌కు వర్తిస్తోంది. ఉద్యమ పార్టీగా మొదలైన పార్టీ ప్రస్థానంలో మొదట కార్యక్రమాల నిర్వహణకు చందాలు వేసుకునే పరిస్థితి. తర్వాత వ్యాపారులు తెలంగాణ వాదులు ఆర్థికసాయం చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులు ఆస్తులు అమ్ముకుని పెట్టుబడి పెట్టారు. ఉద్యమం కీలక దశకు చేరాక కూలీ పనుల పేరుతో బలవంతపు వసూళ్లు.. ఇలా సాగుతూ వచ్చిన టీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ ఏమోకానీ బంగారు టీఆర్‌ఎస్‌గా మారింది. పార్టీ ఆదాయం భారీగా పెరిగింది. ఏ పని చేయకున్నా.. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతున్నా.. పార్టీ సంపాదన మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా పార్టీ జాతీయ పార్టీలకు దీటుగా ఆదాయం పెంచుకుంది బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్.

బంగారు తెలంగాణ పేరుతో..
ప్రత్యేక రాష్ట్రం సాధిచిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని, ఉద్యమ సారథి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. బంగారు తెలంగాణ హామీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీని మాత్రం బంగారుమయం చేసుకున్నాడు. ఎందుకంటే ఇపుడు ఆ పార్టీ వద్ద ఉన్న డబ్బుతో అన్ని జిల్లాల్లో బంగారంతో బీఆర్‌ఎస్ ఆఫీసులు కట్టేంత రిచ్ అయిపోయింది టీఆర్‌ఎస్.
ఇలా పెరుగుతున్న ఆస్తులు..
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ 2019–20 ఆర్థిక సంవత్సరానికి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆస్తులు, అప్పుల జాబితా విడుదల చేసింది.
– 2019 ఆర్థిక సంవత్సరానికి 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులు, అప్పులు మూలధనాన్ని పరిగణనలోకి తీసుకుంది. నివేదిక ప్రకారం, 44 ప్రాంతీయ రాజకీయ పార్టీలలో, టాప్ 10 పార్టీల ఆస్తుల విలువ రూ.2,028 కోట్లు కాగా, ఇది అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తులలో 95 శాతం. అంటే మిగతా 34 పార్టీలకు కేవలం 5 శాతం ఆస్తులే ఉన్నాయి.
ఆమూడు ప్రాంతీయ పార్టీలు బాగా రిచ్..
2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా రూ.563 కోట్లు (26.46 శాతం) సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) వద్ద ఉండగా, టీఆర్‌ఎస్ రూ.301 కోట్లతో రెండో స్థానంలో ఉంది. టీఆర్‌ఎస్‌కు చెందిన మొత్తం రూ.301.47 కోట్ల ఆస్తుల్లో రూ.256.01 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు రూ.21.27 కోట్ల స్థిర ఆస్తులున్నాయి. ఈ పార్టీ బకాయిలు కేవలం రూ.4.41 కోట్లు మాత్రమే. అన్నాడీఎంకే రూ.267.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచింది.
డబుల్ అయిన టీఆర్‌ఎస్ ఆదాయం..
టీఆర్‌ఎస్ పార్టీ క్యాపిటల్ రిజర్వ్ ఫండ్ రూ.297.06 కోట్లు. టీఆర్‌ఎస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తం ఇప్పుడు రూ.420 కోట్లకు పెరిగింది. 2021 అక్టోబర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావే టీఆర్‌ఎస్ ‘‘ఆర్థికంగా పటిష్టంగా’’ ఉందని ప్రకటించారు.

ఏడాదిలో భారీగా పెరిగిన ఆదాయం
భారత్ రాష్ట్రసమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆదాయం ఈ ఏడాదిలో భారీగా పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం పార్టీ ఆదాయం 2021–2022 మధ్యకాలంలో రూ.37.65 కోట్ల నుంచి రూ.218.11 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్టీ ఈ నివేదికలో వెల్లడించింది. ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేదు. ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఏడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాల పరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్ల మేర ఉన్నాయి.
మొత్తంగా జాతీయ పార్టీగా మారిన ఉద్యమ పార్టీ తెలంగాణను ఎనిమిదేళ్లలో బంగారుమయం చేయకపోయినా పార్టీని మాత్రం డైమండ్, ప్లాటినం మయం చేసే దిశగా దూసుకుపోతోంది.