CM Jagan: నా ఫోటో చూసి ఓటేస్తారు.. నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి ఓటేస్తారు.. నా పథకాలు చూసి ఓటేస్తారు.. నిన్నటి వరకు జగన్ చెప్పిన మాట ఇది. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను స్వీప్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అన్నా నువ్వు ఓడిపోతున్నావ్. ఈసారి పోటీ నుంచి తప్పుకో అంటూ ఎమ్మెల్యేలకు చెబుతుండడంతో జగన్ అసలు నైజం బయటపడుతోంది. ఇదేనా నీ గెలుపు నినాదం అంటూ ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో.. తమను మార్చినంత మాత్రాన గెలుపు పొందుతారా? ప్రశ్నిస్తున్నారు. ఎలా గెలుపొందుతారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చారు. ఈ జాబితాలో 80 మంది ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో కొందరికి స్థానచలనం ఉంటుంది. మరికొందరికి ఏకంగా మొండి చేయించుకోవాలని చూస్తున్నారు. అటువంటి వారిని సీఎం ఒక పిలిపించుకొని మాట్లాడుతున్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక నీకు రాజ్యసభ సీటు ఇస్తానని.. ఇంకో పదవి కట్ట పెడతానని.. నీ కుటుంబానికి ఏ కష్టము రాకుండా చూసుకుంటానని బుజ్జగిస్తున్నారు. దీంతో నిరాశతో ఒక్కొక్కరు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయటకు వస్తున్నారు.
అయితే జగన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మరో పార్టీకి వారు వెళ్లే ఆప్షన్ లేకుండా చేస్తున్నారు. అటు నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. వలంటీర్ వ్యవస్థను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అయితే మీపై వ్యతిరేకత ఉంది.. మీరు ఓడిపోతారు అని చెప్పడాన్ని మాత్రం ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలతో జగన్ ముఖాముఖి భేటీ కాలేదు. మీపై వ్యతిరేకత ఉందని చెప్పలేదు. కానీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు, అంతర్గత సర్వేలు తెప్పించుకున్నారు. కానీ వాటిలో వెనుకబడిన ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడిన దాఖలాలు లేవు. వర్క్ షాపులు నిర్వహించి చాలామంది ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని మాత్రమే సూచించారు. కానీ ఇప్పుడు ఏకంగా మీకు టిక్కెట్ ఇస్తే నేను చిక్కుల్లో పడతానని చెబుతుండడాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు.
అసలు తమను పాలనలో ఎక్కడ భాగస్తులు చేశారని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కింద వలంటీర్లు, పైన సీఎం ఉండగా.. మధ్యలో డమ్మీలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాల్లో నియమిస్తున్నారు. మన ఇంట్లో చెత్త పక్కింట్లో పడేస్తే బంగారం అవుతుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వ్యతిరేకత ఉన్నప్పుడు.. ఏ నియోజకవర్గంలో పోటీ పెట్టినా.. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో జగన్ లేరు. మీపై వ్యతిరేకత ఉంది. మీరు తప్పుకోండి అని మాత్రమే సెలవిస్తున్నారు. అయితే అవమాన భారంగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం తమ ప్రతాపాన్ని ఎన్నికల్లో చూపిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు సిట్టింగుల నుంచి సాయం కొరవడితే మాత్రం.. జగన్ ప్రయోగం ఒక విఫలయత్నంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.