Balineni Srinivas Reddy: సీఎం జగన్ కలిసేందుకు ఇష్టపడని బాలినేని

గత కొన్ని రోజులుగా వైసీపీ హై కమాండ్ పై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ అంటే మాకు ప్రాణం. ఆయనకు మా మీద అంతే ప్రేమ ఉండాలి కదా అని ఆమధ్య వ్యాఖ్యానించారు. మంత్రివర్గం నుంచి తప్పించిన నాటి నుంచి బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Written By: Dharma, Updated On : December 22, 2023 9:04 am

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivas Reddy: సీఎం జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఎప్పుడు సీఎం జన్మదిన వేడుకల్లో ఆయన హడావుడి చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. కనీసం తాడేపల్లి వెళ్లి జగన్ కు పుష్పగుచ్చం కూడా అందించలేదు. అటు జిల్లాలో సైతం హాజరు కాలేదు. నియోజకవర్గంలో ఎక్కడా ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.ఏకంగా ఆయన హైదరాబాదులో ఉండి పోయినట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా వైసీపీ హై కమాండ్ పై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ అంటే మాకు ప్రాణం. ఆయనకు మా మీద అంతే ప్రేమ ఉండాలి కదా అని ఆమధ్య వ్యాఖ్యానించారు. మంత్రివర్గం నుంచి తప్పించిన నాటి నుంచి బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ తరువాత జరిగిన చాలా పరిణామాలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీంతో రీజినల్ కోఆర్డినేటర్ పదవిని ఆయన వదులుకున్నారు. కేవలం ఒంగోలు నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఆ మధ్యన తన సెక్యూరిటీని ప్రభుత్వానికి సరెండర్ చేసి సంచలనం రేపారు. అయితే బాలినేని విషయంలో జరుగుతున్న పరిణామాలతో జగన్ చికాకుతో ఉన్నారు. బాలినేని వదులుకునేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో బాలినేని టిడిపి, జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది.

తనను రాజకీయంగా కార్నర్ చేస్తున్నారన్న అనుమానం బాలినేనిలో ఉంది. ఒంగోలులో పాతికవేల మందికి పట్టాలు ఇస్తేనే తాను ఎన్నికల్లో నిలబెడతానని ఆ మధ్యన బాలినేని ప్రకటించారు. ఇప్పటికీ అదే మాట చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాతికవేల పట్టాల ప్రకటన చేస్తూ వచ్చారు. కానీ సీఎం జగన్ పట్టించుకోలేదు. కనీసం భూసేకరణ నిధులు కూడా విడుదల చేయలేదు. అటు మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇటు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం లేదు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో గడుపుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఆయన వ్యవహార శైలి అనుమానంగా మారింది. హై కమాండ్ సైతం ఆయనను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జిల్లా రాజకీయాల్లో బాలినేని చక్రం తిప్పారు. అటు వైసీపీలో సైతం తన మాటను నెగ్గించుకుంటూ వచ్చారు. కానీ వైవి సుబ్బారెడ్డి ప్రాధాన్యత పెరగడంతో.. బాలినేనిని జగన్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు పెద్దన్న పాత్ర పోషించానని.. ఇప్పుడు తనకు తెలియకుండా రాజకీయాలు జరుగుతున్నాయని బాలినేని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా పోటీ చేస్తామని తనకు తానుగా బాలినేని ప్రకటించుకున్నారు. కానీ ఈ విషయంలో కూడా హై కమాండ్ నుంచి ఎటువంటి స్పష్టత లేదు. దీంతో తీవ్ర కోపంతో బాలినేని రగిలిపోతున్నారు. నేరుగా హైదరాబాద్ వెళ్లి విజయసాయిరెడ్డి తో చర్చలు జరిపినా.. ఆశించిన స్థాయిలో సానుకూలత రాలేదు. దీంతో ఆయన హైదరాబాదులోనే ఉండిపోయారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన తాడోపేడో అన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.