ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ల ప్రారంభం మరోమారు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నెల 5 నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయని చెప్పిన జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని నవంబర్ 2కు వాయిదా వేసింది. అయితే విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా జగనన్న విద్యాదీవెన పథకం ఈ నెల 5 నుంచే అమలు చేస్తామని జగన్ సర్కార్ తెలిపింది.
Also Read : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?
నిన్న స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సమావేశం నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. జగనన్న విద్యాకానుక కిట్లు ముందుగానే విద్యార్థులకు అందితే పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులు యూనీఫామ్ కుట్టించుకోగలుగుతారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్కూళ్ల ప్రారంభాన్ని వాయిదా వేశామని వెల్లడించారు.
రైతు భరోసా కేంద్రాల్లో అక్టోబర్ 5 నుంచి గిట్టుబాటు ధరలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తే నిలదీయాలని.. ఎల్లో మీడియా వల్ల రాష్ట్రంలో మంచి పనులు సైతం ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడిన వారికి ఉచితంగా వైద్యం అందేలా చేయడం మన కర్తవ్యం అని చెప్పారు. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని పది జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని.. త్వరగా పంటల నష్టాన్ని అంచనా వేసి పంపించాలని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు సిద్ధపడుతున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పనులు వేగంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సూచనలు చేశారు. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందుతున్నాయో లేదో గుర్తించాలని వెల్లడించారు.
Also Read : తెలంగాణ టీడీపీ పగ్గాలు ఆ హీరో చేతికంట.. నిజమేనా..?