Telangana Elections 2023
Telangana Elections 2023: అరచేతిలో ప్రపంచం ఇమిడిపోతున్న ఈ రోజుల్లోనూ 80 శాతం జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. అంతటి కరోనా పీడ దినాల్లోనూ మన దేశ జనాభాను ఆదుకున్నది కేవలం వ్యవసాయం మాత్రమే. అన్ని రంగాలు కుదేలైనప్పటికీ వ్యవసాయం మాత్రం స్థిరంగా నిలబడగలిగింది. అంతటి చరిత్ర ఉన్న వ్యవసాయానికి వెన్నుదన్ను అందించడంలో ప్రభుత్వాలు నేటికీ విఫలమవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అని రాజకీయ పార్టీలు రైతు కేంద్రంగానే మేనిఫెస్టోలు రూపొందించాయి. ఆయాచితంగా త్వరలో ప్రకటించాయి. కేవలం పంపకాల మీదనే దృష్టిపెట్టిన రాజకీయ పార్టీలు.. వాస్తవ సమస్యలను గుర్తించడంలో, పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టో జంబో ప్యాకేజీ లాగా కనిపించింది. దాదాపు అన్ని వర్గాలకు సమచిత ప్రాధాన్యం ఇచ్చిన మేనిఫెస్టోలో వ్యవసాయానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రం అతిశయోక్తిగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రైతుబంధును పెంచారు
రైతుబంధు డబ్బులు రైతులు తాగడానికి ఉపయోగిస్తున్నారని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ అదే ఆయన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో మాత్రం రైతుబంధు పథకంలో భాగంగా ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. దీనిని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ట్రోల్ చేస్తోంది. పంటల మద్దతు ధర ప్రకటిస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా మద్దతు ధర ప్రకటిస్తుందో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోయారు. ఇదే సమయంలో కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇక్కడే వారికి సూటి ప్రశ్న ఎదురవుతున్నది.
ఎలా గుర్తిస్తారు
శుక్రవారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడారు. సందర్భంగా ఆ న్యూస్ ఛానల్లో పనిచేసే విలేకరులు పలు రకాల ప్రశ్నలు అడిగారు. అయితే ఏ ప్రశ్నకు కూడా విక్రమార్క సరైన స్థాయిలో సమాధానం చెప్పలేకపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు, వ్యవసాయ కూలీల నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? అనే ప్రశ్నలకు భట్టి విక్రమార్క నీళ్ళు నమిలారు. ఉదాహరణకు ఒక భూమి రైతు పేరిట ఉంటే దానికి ప్రభుత్వం పంట పెట్టుబడి కింద నగదు అతడి ఖాతాలో జమ చేస్తుంది. అదే సమయంలో అతడు గనుక ఆ భూమిని రైతుకు కౌలుకు ఇస్తే.. అతడికి కూడా ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద నగదు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకవేళ పంట పెట్టుబడి సాయం కింద నగదు ఇస్తే, అదే భూమిని కౌలుకు సాగు చేశా రైతుకు ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందిస్తారనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద సమాధానం లేదు. ఇదే సమయంలో వ్యవసాయ కూలీలను గుర్తిస్తారో చెప్పడం లేదు. ఇప్పటికే యాంత్రికరణ వల్ల చాలామంది వ్యవసాయ కూలీలకు పని దొరకడం లేదు. పైగా ఉపాధి పథకం కూడా అంతంత మాత్రమే అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కూలీలు ఉపాధి కోసం నగరాల బాటపడుతున్నారు. మరి ఇలాంటప్పుడు వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ పార్టీ నగదు చెల్లించే పథకానికి శ్రీకారం చుడితే.. వ్యవసాయం మరింత సంక్షోభంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక మన దేశంలో ఇప్పటివరకు వ్యవసాయ కూలీలకు నగదు సహాయం చేసిన దాఖలాలు లేవు. ఇక కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అధికారమే పరమావధిగా వరాలు ప్రకటించిందని, వీటిని పూర్తి చేయాలంటే చాలా బడ్జెట్ కావాలని, ఇది ఎలా సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కాగా, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు సంబంధించి భట్టి విక్రమార్క చెప్పిన సమాధానాలు నమ్మశక్యంగా లేకపోవడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. ” ఇప్పుడే ఇలా నీళ్ళు నములుతున్నారు. రేపు అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తారా” అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో చెప్పలేకపోయిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క pic.twitter.com/ESc3V9uKpZ
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2023