Ravela Kishore Babu: మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరనున్నారా? తనకు అధికార పార్టీయే సేఫ్ అని భావిస్తున్నారా? అందుకే రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కిషోర్ బాబు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ మధ్యన కెసిఆర్ పార్టీ విస్తరణలో భాగంగా రావెల కిషోర్ బాబును బిఆర్ఎస్ లో కి ఆహ్వానించారు. తరువాత ఏపీలో బీఆర్ఎస్ విస్తరణను వాయిదా వేశారు. దీంతో అప్పటి నుంచి రావెల బిఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని భావించినా అది జరగలేదు. ఇప్పుడు వైసీపీ వైపు ఆయన చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2014 ఎన్నికల్లో రావెల కిషోర్ బాబు అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటివరకు వివిధ హోదాల్లో అధికారిగా పనిచేసిన ఆయన టిడిపిలో చేరారు. 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్సి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు. కానీ మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన, బిజెపిలో చేరారు. అక్కడ కూడా సరైన గుర్తింపు లేదని చెప్పి.. కెసిఆర్ పిలుపుమేరకు బిఆర్ఎస్ లో చేరారు.
ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె ఊగిసలాటలో ఉన్నారు. వైసీపీని వీడుతారని ప్రచారం జరిగినా ఆమె ఖండించారు. పార్టీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు ఆమె భర్త ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని సుచరిత తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రావెల కిషోర్ బాబు ఎమ్మెల్యేగా వ్యవహరించి ఉన్నందున.. వైసీపీలో చేరితే టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్నారు. అందుకే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కానీ వైసీపీ హై కమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే రావెల కిషోర్ బాబు మాత్రం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.