రైతు చుట్టూనే కేసీఆర్ పాలన కొనసాగుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న రైతు కోణం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తుంటారని మంత్రి తెలిపారు. కేసీఆర్ ముందు చూపుతో నేడు దేశానికి అన్నంపెట్టే స్థితికి తెలంగాణ చేరుకుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు దేశంలో మరెక్కడా లేదని అన్నారు.
నియంత్రిత సాగు విధానం పై నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా మారాలని అన్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రైతు వేదికలు విధిగా ఏర్పాటు చేసుకోవాలనారు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను చూసుకుని వేదికలు నిర్మించుకోవాలని అన్నారు. దాతలు ముందుకొచ్చి విరాళంగా నిర్మాణం చేసి ఇస్తే తమకు నిచ్చిన వారి పేర్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. సోనా సాగు పై రైతులు దృష్టిపెట్టాలని అన్నారు. చెరుకును ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. డిమాండ్ ఉన్న పంటలతోనే రైతులకు లాభం వస్తుందన్నారు. ఆ దిశగా రైతులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ సూచనలు చేస్తుందని చెప్పారు. అన్ని పంటల్లో నూతన వంగడాలతో రైతుల దిగుబడులు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, డిమాండ్ ఉన్నపంటలు , పంటల నిలువకు గోడౌన్లు ప్రతి అంశాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు. ప్రతి పంటకు ముందు వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు, రైతు వేదికల ద్వారా రైతులకు సాగులో మెలకువలపై కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు పువ్వాడ తెలిపారు.